Actress Rambha | ముప్పై ఏళ్ళ క్రితం ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది స్టార్ హీరోయిన్ రంభ. ఫస్ట్ మూవీనే సూపర్ హిట్ కావడంతో రంభకు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత సూపర్ కృష్ణ, చిరంజీవి, సల్మాన్ ఖాన్, రజనీకాంత్, విజయ్, తదితర అగ్ర నటులతో నటించింది ఈ భామ. అయితే కొన్నేళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉంటున్న ఆమె తాజాగా రీఎంట్రీకి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా తాను సినిమాలకు ఎందుకు దూరం అయ్యాను అనే విషయాన్ని పంచుకుంది.
పెళ్లి తర్వాత కెనడాలో సెటిల్ అయ్యానని తెలిపిన రంభ, తల్లిగా పిల్లల బాధ్యతల కారణంగా సినిమాలకు దూరమైనట్లు చెప్పారు. తనకు 14, 10 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలతో పాటు 6 ఏళ్ల కుమారుడు ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం వారు తమ పనులు తాము చేసుకునే స్థితిలో ఉన్నారని వెల్లడించారు. సినిమాలపై తనకున్న ఆసక్తి గురించి తన భర్తకు తెలుసని, అందుకే మళ్లీ నటించాలన్న తన నిర్ణయాన్ని ఆయన సమర్థించారని రంభ తెలిపారు. ఇటీవల ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరించినట్లు చెప్పిన ఆమె, తొలుత భయపడినప్పటికీ, ఆ షో విజయవంతంగా సాగిందని, ప్రేక్షకుల చప్పట్లు తనలో ఉత్సాహాన్ని నింపాయని పేర్కొన్నారు. మళ్లీ నటనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన రంభ, తనతో కలిసి నటించిన చాలా మంది సహ నటులు ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని, వారి సహకారం తనకు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన వద్ద కొన్ని సినీ ఆఫర్లు ఉన్నాయని, త్వరలోనే తాను నటించబోయే చిత్రం గురించి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.
రంభ రీ ఎంట్రీ గురించి ఇటీవల తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను మాట్లాడుతూ.. రంభ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. రంభ ఆర్థికంగా ప్రస్తుతం స్థిరంగా ఉన్నారు. ఆమె భర్త కూడా ఒక ప్రముఖ వ్యాపారి. అయితే అతడు కొన్ని రోజుల క్రితం నన్ను కలిసినప్పుడు రంభకు ఒక గొప్ప సినిమా ప్రాజెక్ట్‌లో అవకాశం కల్పించమని కోరారు. అటువంటి అవకాశం దొరికితే ఆమెను తప్పక సంప్రదిస్తానని ఆయనకు హామీ ఇచ్చాను అని తెలిపారు. ఈ విషయంతో, ఈ నటి త్వరలో సినీ రంగంలోకి మళ్లీ అడుగుపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.