తెలుగు సినిమా ‘వెండితెర’కు బంగారు కాంతుల పాటల తళుకులు అద్దిన కవి డా॥ సి.నారాయణరెడ్డి. ఆయన సినిమా పాటను తొలి నుంచీ దగ్గరగా పరిశీలిస్తే.. ప్రణయ శృంగారాల కన్నా… కుటుంబ మూలాలు, మానవీయ విలువలు, జీవన మూల్యాల లాంటి వాటికి పెద్దపీట వేశారు అనిపిస్తుంది. అమ్మ, నాన్న, అక్క, అన్న, చెల్లెలు… ఇలా బాంధవ్యాలెన్నో ఆయన పాటల్లో వినిపించేవి. కుటుంబ విలువలను వ్యక్తపరిచేవి.
తొలి సినిమా ‘గులేబకావళి కథ’లోని ‘ఉన్నది చెబుతా వింటారా – నేనన్నది ఔనని అంటారా/ తండ్రుల కోసం త్యాగం చేసిన తనయులెందరో ఉన్నారని’ పాటలో… ‘తండ్రి బాస కాపాడి తన రాచగద్దె విడనాడి/ నార చీరలు దాల్చి కానలకు/ తరలిపోయెనా దశరథరాముడు’లో తండ్రి కోసం జీవితాలను త్యాగం చేసిన విలువలను చెబుతారు. సినారె. నిజానికి ఈ పాట రామాయణ, భారతాల్లోని ఉదాత్త పాత్రలను ఉదహరిస్తూ చెప్పినట్టుగా మనకు కనిపించొచ్చు. కానీ, ఇది తరతరాలుగా భారతీయ సమాజం కాపాడుకుంటూ వస్తున్న విలువలు.. మరో తరానికి వారసత్వంగా ఎలా వస్తున్నాయో సరళంగా చెప్పిన పాట. మరికొన్ని సినిమాల్లోనూ మహాకవి సినారె తండ్రిని గురించి రాశారు. ‘సర్వర్ సుందరం గారి అబ్బాయి’లో.. ‘నీ కన్న ఓ నాన్న నాకెవ్వరు.. నీవుంటే ఈ ఇంట సిరినవ్వులు/ ఏ దారి కనరాని ఈ వేళలో- నీ నవ్వులే నాకు చిరుదివ్వెలు’ అంటారు నారాయణరెడ్డి. ‘అమ్మ ఒక వైపు దేవతలంతా ఒకవైపు / సరితూచమంటే నేను ఒరిగేను అమ్మవైపు’ అంటూ కవిత్వంలో, పాటల్లో అమ్మకు ఎంత ఉదాత్తంగా, ఉన్నతంగా చిత్రించారో మనకు తెలుసు.
‘నాన్న’ను కూడా తన పాటల్లో అద్భుతంగా ఆవిష్కరించారు సినారె. ఒక సన్మాన సభలో ‘పదుగురు పాలేర్లున్నా / పదపదమని మా నాయన/ మల్లన దున్నిన/ రేగెడు మట్టికి ఈ సన్మానం’ అంటూ తండ్రి సింగిరెడ్డి మల్లారెడ్డి పటేల్ గురించి చెబుతారు. ఈ కోవలోనే నాన్న విలువను, నాన్న గొప్పతనాన్ని, త్యాగాలను చెబుతూ సినిమాల కోసం రాశారు. వాటిలో ఓ అందమైన పాట 1970లో ‘ధర్మదాత’ కోసం సినారె రాసిన ‘ఓ నాన్న.. నీ మనసే వెన్న..’ పాట. ఇది మనం ఎన్నోసార్లు విన్నదే… ఎన్నెన్ని సందర్భాల్లోనో పాడుకున్నదే!
పల్లవి
ఓ నాన్నా ఓ నాన్నా
ఓ నాన్నా నీ మనసే వెన్న-
అమృతం కన్నా అది ఎంతో మిన్న
ఓ నాన్న – ఓ నాన్న
చరణం 1:
ముళ్లబాటలో నీవు నడిచావు
పూల తోటలో మమ్ము నడిపావు
ఏ పూట తిన్నావో- ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం మాకు దాచి ఉంచావు
చరణం 2
పుట్టింది అమ్మ కడుపులోనైనా
పాలు పట్టింది నీ చేతిలోనా
ఊగింది ఊయ్యాలలోనైనా
నేను దాగింది నీ చల్లని ఒడిలోనా
చరణం 3
ఉన్ననాడు ఏమి దాచుకున్నావు
లేనినాడు చేయిచాచనన్నావు
నీ రాచ గుణమే.. మా మూలధనము
నీవే మా పాలి దైవము
నాన్నకు విశేషమైన స్థానాన్నిస్తూ సినారె కూర్చిన అక్షర చిత్రమిది. ఇది అందరు నాన్నల రూపం. అందరు నాన్నల త్యాగాలకు పట్టిన దివిటీ. పల్లవిలో వెన్నలాంటిది నాన్న మనసని, ‘అమృతం కన్నా’ ఆ మనసు గొప్పదని చెబుతారు కవి. పల్లవిలోనే నాన్న గొప్పగా వర్ణించిన కవి సినారె తరువాతి మూడు చరణాల్లో నాన్న చేసే త్యాగాలను, తమ పిల్లలకు మంచి జీవితాన్నిచ్చేందుకు తాము అనుభూతి చెందిన, అనుభవించిన కష్టనష్టాలను చూపుతారు. నిజానికి సినారె తండ్రి సింగిరెడ్డి మల్లారెడ్డి నూరెకరాల భూస్వామి, కడుపులో చల్ల కదలకుండా పెరిగిన బాల్యం సినారెది. ఉన్నత చదువులు చదవకున్నా ‘దొర’గా హాయిగా సాగిపోయె కుటుంబ నేపథ్యం. కానీ, ప్రాథమిక పాఠశాల తరువాత పై చదువులకు వెళ్లేందుకు సినారె తల్లితండ్రులు అంగీకరించలేదు. చదువుకోవాలన్న మక్కువతో బావిలో దూకారట ఆయన. వెంటనే వారిని ఐదో తరగతి కోసం సిరిసిల్లకు పంపించారు. అతిపెద్ద వ్యవసాయం ఉన్నా అలా అక్షరసేద్యం వైపు తరలారు సినారె.
తాను తిన్నా తినకున్నా పిల్లలకు అన్నీ సమకూర్చి, తన జీవితం ముళ్లదారిలో నడిచినా తన పిల్లలకు బంగారు జీవితం ఇచ్చేవాడు తండ్రి. అయనకు ఆ దారిలో ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అవలీలగా దాటుతాడు. ఇంకా తాను గంజి నీళ్లు తాగినా తన పిల్లల కోసం పరమాన్నం తెస్తాడు. తిన్నా తినకున్నా, పస్తులున్నా అది తెలియకుండా తన పిల్లలకు మాత్రం అన్నీ పంచుతాడు. ఇక ఈ పాట విషయానికి వస్తే ఇందులోని సంతానం తాము పుట్టింది అమ్మ కడుపులో అయినా, వారిని పాలుపట్టి పెంచింది తండ్రి అని చెప్పడం తండ్రి విలువను మరింతగా ఇనుమడింపజేస్తూనే, త్యాగాల ప్రతిరూపమైన ఆ స్థానానికి చక్కని విలువను ఆపాదించింది.
అంతేకాదు కుటుంబంలోని వ్యక్తుల ఔన్నత్యంతో పాటు కుటుంబానికి మూలస్తంభమైన తండ్రిని గురించి చక్కగా చెబుతుంది ఈ పాట. కుటుంబం అంటే కేవలం వ్యక్తులు మాత్రమే కాదు అందులోని మనుషులు, విలువలు, మానవ సంబంధాలు లాంటి అనేక తాత్విక విషయాలు ఉంటాయి. ఇక భాషా వ్యాకరణాల విషయానికి వస్తే ‘నాన్న’, ‘మిన్న’… తదితర ‘న’కార ప్రయోగాలు, ప్రాసలు ఈ పాటకు అందంతో పాటు లయాత్మక పూనికను సమకూర్చాయి. నిజానికి సినారె అంటేనే ‘తెలుగు కవితకు లయాత్మకత’ను అద్దిన ద్రష్ట. గేయకథా కావ్యాలకు ఆధునిక యుగంలో అమరత్వాన్ని కూర్చిన గేయబ్రహ్మ.
– పత్తిపాక మోహన్