Coolie Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కూలీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు. నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ (A) సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా చూద్దామనుకున్న టీనేజ్ యువతకు అవకాశం లేకుండా పోయింది. ఇదిలావుంటే ఈ సినిమాకు అసలు ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ఏ సినిమాలో అయిన వయోలెన్స్ ఎక్కువ ఉండడం.. లేదా బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉంటే దానికి ఏ సర్టిఫికెట్ జారీ చేస్తుంది సెన్సార్ బోర్డు. కానీ కూలీ చిత్రంలో ఎటువంటి బోల్డ్ సీన్స్ లేకపోగా.. వయోలెన్స్ పార్టు కూడా తక్కువగానే ఉంది. అయిన కూడా కూలీకి ఎందుకు ఏ సర్టిఫికెట్ జారీ చేశారంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై ఒక విషయం బయటకి వచ్చింది. ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేయడానికి ముఖ్య కారణం ఈ సినిమాలో చూపించిన పోర్టు సన్నివేశాలు అని తెలుస్తుంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఏ సినిమాలో అయిన దేశంలో ఉన్న ప్రైవేట్ పోర్టులను అక్రమ కార్యకలాపాలకు కేంద్రాలుగా చూపించడం చేయకుడదు. దీనివలన దేశ ప్రతిష్టకు భంగం కలిగించే అవకాశం ఉందని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. అయితే చాలా వరకు కూలీ సినిమా పోర్టులోనే షూటింగ్ జరుపుకోవడంతో పాటు ఇందులో కూడా అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సన్నివేశాలు ఉండడం వలన యూ/ఏ(U/A) సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే, సినిమాలోని కొన్ని సన్నివేశాలను మార్పు చేయాలని చిత్ర బృందానికి సూచించగా.. దీనికి లోకేష్ ఒప్పుకోకపోవడంతో ఏ(A) సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తుంది.