Thudarum | మలయాళంలో సంచలన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ ‘తుడరుమ్’ (Thudarum) చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రీమేక్‌లో బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగణ్ (Ajay Devgn) ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘తుడరుమ్’ సినిమా దర్శకుడు తరుణ్ మూర్తి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తూ.. తెలుగు, హిందీ పరిశ్రమల నుంచి తుడరుమ్ సినిమా రీమేక్ హక్కుల కోసం చాలా మంది సంప్రదిస్తున్నారని ఆయన తెలిపారు. అయితే ఈ జాబితాలో అజయ్ దేవగణ్ కూడా ఉన్నారని ఆయన కూడా తనను కలిసినట్లు తరుణ్ మూర్తి వెల్లడించారు.
‘తుడరుమ్’ సినిమాలో మోహన్‌లాల్ పోషించిన పాత్రకు అజయ్ దేవగణ్ అయితేనే సరైన న్యాయం చేయగలరని దర్శకుడు తరుణ్ మూర్తి అభిప్రాయడినట్లు సమాచారం. ముఖ్యంగా, దేవగణ్ స్టంట్‌మెన్‌గా ఉన్న నేపథ్యం, అలాగే భావోద్వేగాలను పలికించగల సామర్థ్యం ఈ పాత్రకు సరిపోతాయని ఆయన పేర్కొన్నారు. ఇది నిజమైతే, మోహన్‌లాల్ నటించిన మరో మలయాళ సూపర్ హిట్ చిత్రాన్ని అజయ్ దేవగణ్ రీమేక్ చేసినట్లు అవుతుంది. గతంలో కూడా మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం’ (Drishyam) ఫ్రాంచైజీని అజయ్ దేవగణ్ హిందీలో రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం, ఆయన ‘దృశ్యం 3’ రీమేక్ కోసం కూడా సిద్ధమవుతున్నారు.
‘తుడరుమ్’ కథ: ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ (బెంజ్ షణ్ముగం) పాత్రలో నటించారు. తన కుటుంబం కోసం, తనకిష్టమైన కారు కోసం పడే తపన, ఆ తర్వాత అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కోవడం, దాని వెనుక ఉన్న ట్విస్టులు, రివెంజ్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 235 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.