Kamal Haasan | కన్నడ భాషపై తమిళ స్టార్ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వివాదంలో తనకు మద్దతుగా నిలిచిన తమిళనాడు ప్రజలకు కమల్ హాసన్ కృతజ్ఞతలు (Thank you Tamil Nadu) తెలిపారు.
మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ నటించిన ‘థగ్‌లైఫ్’ చిత్రం జూన్ 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ తన చిత్ర బృందంతో కలిసి ఇవాళ చెన్నైలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు. కన్నడ వివాదంలో తనకు మద్దతు ఇచ్చి, అండగా నిలిచిన తమిళనాడు, తమిళ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘నాకు మద్దతు ఇచ్చి, అండగా నిలిచినందుకు తమిళనాడుకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఉయిరే, ఉరవే, తమిళే (నా ప్రాణం, నా బంధుత్వం, తమిళం) .. ఈ వ్యాఖ్యాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. దానికే కట్టుబడి ఉన్నా’ అంటూ చెప్పుకొచ్చారు.
వివాదం ఏంటంటే..?
కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గత వారం చెన్నైలో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. ‘కన్నడం.. తమిళం నుంచి పుట్టింది’ అని కామెంట్ చేశారు. ఇదే కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉయిరే, ఉరవే తమిళే (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కమల్ హాసన్ అనంతరం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌ని ఉద్దేశించి మాట్లాడారు.
‘శివరాజ్‌కుమార్ వేరే రాష్ట్రంలో నివసిస్తున్నా నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అందుకే నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళ నుంచే పుట్టింది. ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు’ అని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. బెంగళూరులో థగ్‌లైఫ్ సినిమా బ్యానర్లను కొందరు ఆందోళనకారులు చించివేశారు. ‘కర్ణాటకలో మీకు వ్యాపారం కావాలి.. కానీ కన్నడ భాషను అవమానిస్తారా?’ అని ధ్వజమెత్తారు. కన్నడ ప్రజలకు కమల్ క్షమాపణలు చెప్పాలడి డిమాండ్ చేశారు.
తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను.. కమల్ హాసన్
మరోవైపు తాజా వివాదంపై క్షమాపణ చెప్పడానికి కమల్‌హాసన్ నిరాకరించారు. తప్పు చేస్తేనే తాను క్షమాపణలు చెబుతానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘గతంలో కూడా నా మీద ఇలాంటి బెదిరింపులు చాలానే వచ్చాయి. తప్పుచేయని పక్షంలో నేను అస్సలు క్షమాపణలు చెప్పను. ఇది నా జీవన విధానం. నేను ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, చట్టాన్ని నమ్ముతాను. ఈ విషయంలో ప్రజలు జోక్యం చేసుకోవద్దు’ అని కమల్‌హాసన్ స్పష్టం చేశారు. మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘థగ్‌లైఫ్’ జూన్ 5న విడుదలకానుంది.
మీరేమైనా చరిత్రకారులా..?.. కర్ణాటక హైకోర్టు ఆగ్రహం
కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్య్ర హక్కను ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు ఉపయోగించొద్దంటూ హెచ్చరించింది. తాజా వివాదం నేపథ్యంలో కమల్ హాసన్ తాజా చిత్రం ‘థగ్‌లైఫ్’ ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ది కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కమల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తన రాబోయే చిత్రం థగ్ లైఫ్‌ను రాష్ట్రంలో విడుదల చేసి ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కమల్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘క్షమాపణలు చెప్పకుండా కోర్టుకు వచ్చారా..?’ అంటూ తీవ్రంగా మండిపడింది.
‘మీరు కమల్ హాసన్ కావొచ్చు.. ఎంత పెద్ద నటుడైనా కావొచ్చు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు మీకు లేదు. ఒక ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదు. మీ కామెంట్స్ వల్ల అశాంతి ఏర్పడింది. నీరు, భూమి, భాష.. ఇవి ప్రజలకు ముఖ్యమైనవి. ఈ దేశ విభజన భాషా ప్రాతిపదికన జరిగింది. ఏ భాష మరొక భాష నుంచి పుట్టదు. మీ వ్యాఖ్యలతో కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. మీరేమైనా చరిత్రకారులా? లేక భాషావేత్తనా..? ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు..? కన్నడ ప్రజలు మిమ్మల్ని ఏమి అడిగారు..? కేవలం క్షమాపణలే కద. ఈ వ్యవహారంలో ఒక్క క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది’ అని న్యాయమూర్తి నాగప్రసన్న వ్యాఖ్యానించారు.
Also Read..
“Kamal Haasan | సత్యం ఎన్నటికీ తల వంచదు.. కన్నడ భాషపై వివాదం వేళ కమల్ హాసన్‌కు మద్దతుగా పోస్టర్లు”