“తంగలాన్’ ఇండియానా జోన్స్ తరహా సినిమా. ట్రైబల్ నేపథ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథ ఇది. ఈ సినిమా కోసం ఆస్ట్రేలియన్, ఆఫ్రికన్ ట్రైబ్స్ సృష్టించిన సంగీతాన్ని అధ్యయనం చేశాను’ అన్నారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్. ఆయన స్వరాలను సమకూర్చిన తాజా చిత్రం ‘తంగలాన్’ ఈ నెల 15న ప్రేక్షకులముందుకొస్తున్నది.
విక్రమ్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్‌కుమార్ మాట్లాడుతూ ‘ఈ తరహా సినిమాకు ఆధునిక సంగీతం సెట్ కాదు. కథానేపథ్యానికి అనుగుణంగా మ్యూజిక్ చేశా. రీరికార్డింగ్‌కు 50 రోజులు పట్టింది. దర్శకుడు పా.రంజిత్ విజన్‌కు అనుగుణంగా సంగీతాన్ని అందించా. ఈ కథలో ప్రేమ, కుట్ర, పోరాటం వంటి అన్ని ఎమోషన్స్ ఉంటాయి’ అన్నారు.
మ్యాజికల్ రియలిజం స్క్రీన్‌ప్లేతో పా.రంజిత్ ఈ సినిమాను రూపొందించారని, హీరో విక్రమ్ ఈ పాత్ర కోసం తనని తాను తీర్చిదిద్దుకున్న విధానం అబ్బురపరుస్తుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికత అందుబాటులోకి వచ్చినా దానిపైనే ఆధారపడటం సరికాదని, అవసరం మేరకు ఉపయోగించే విషయంలో అవగాహన ఉండాలని జీవీ ప్రకాష్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగులో లక్కీ భాస్కర్, రాబిన్‌హుడ్ చిత్రాలకు సంగీతాన్నందిస్తున్నానని, దిల్‌రాజు, వైజయంతీ సంస్థలో సినిమాలు చేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు.