బతుకుతెరువుకోసం సముద్రం పైకెళ్లి శత్రుదేశానికి చిక్కిన ఓ భర్త పోరాటం. పెనిమిటిని దక్కించుకోటానికి నిండుచూలాలైన భార్య సొంత దేశంలో పడే ఆరాటం.. వెరసి ‘తండేల్’. ఆర్థ్రతతో నిండిన ఈ పరిపూర్ణప్రేమకథకు నాగచైతన్య, సాయిపల్లవి నాయకా, నాయికలు. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రారంభం నుంచి అంచనాలు అంబర స్థాయిలోనే ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తయింది. తాజా షెడ్యూల్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ఈ నెల 10 నుంచి మొదలుకానుందని సమాచారం. ఈ షెడ్యూల్లో నాగచైతన్య, సాయిపల్లవిలపై ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట దర్శకుడు చందు మొండేటి. నాగచైతన్య ఇందులో మత్స్యకారుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న యథార్థగాథ ఇదని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సమర్పణ: అల్లు అరవింద్.