‘తమ్ముడు’ చిత్రంతో జూలై 4న ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు హీరో నితిన్. అక్కాతమ్ముడి అనుబంధం నేపథ్యంలో రూపొందించిన ఈ ఫ్యామిలీ డ్రామాకు శ్రీరామ్ వేణు దర్శకుడు. దిల్రాజు, శిరీష్ నిర్మాతలు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఈ నేపథ్యంలో మంగళవారం ‘భూ అంటూ భూతం..’ అనే తొలి గీతాన్ని విడుదల చేశారు. మేనమామ తన మేనకోడలికి ధైర్యం చెప్పే సందర్భంలో ఈ పాటను తెరకెక్కించారు.
అజనీష్ లోక్నాథ్ స్వరపరచిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, అక్షిత ఆకట్టుకునేలా ఆలపించారు. సింహాచలం మన్నేలా సాహిత్యాన్ని అందించారు. ‘భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి.
పుట్టగానే నేరుగా నువ్వు పరుగెత్తలే, పట్టుకుంటూ పడుతూ నడకే నేర్చావే, భయపడి అడుగు ఆపకే..’ అనే ధైర్యవచనాలతో ఈ గీతం సాగింది. కుటుంబ అనుబంధాలకు దర్పణంలా ఈ సినిమా ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది. వర్ష బొల్లమ్మ, లయ, సప్తమిగౌడ, స్వసిక విజయన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్నాథ్, రచన-దర్శకత్వం: శ్రీరామ్ వేణు.