SS Thaman | ‘‘ఏదైనా దొంగతనం చేస్తే వెంటనే దొరికిపోవడం వాడి స్టైల్’’ అంటూ జులాయి సినిమాలో బ్రహ్మానందం గురించి అల్లు అర్జున్‌కి రాజేంద్ర ప్రసాద్ చెప్పే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకి దారి తీసింది . ఎందుకంటే ఆ డైలాగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి పర్ఫెక్ట్గా సూటవుతోంది అని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. తమన్‌పై “కాపీ మాస్టర్” అన్న అపవాదు కొత్తది కాదు. హిందీ, ఇంగ్లీష్ సినిమాల నుంచి ట్యూన్లు కాపీ చేస్తూ వచ్చారని, ఇప్పటికే ఎన్నోసార్లు సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వచ్చిన సంగతీ తెలిసిందే. అయినా తన పని తీరు మార్చుకోకుండా మళ్లీ మళ్లీ అదే పని చేస్తుండటంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. హీరో కేరెక్టర్‌ను హై లైట్ చేసేలా ఉన్న ఈ మ్యూజిక్ ట్రాక్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌కి చేరింది. అయితే ఆ సాంగ్ హిందీ మూవీ బేబీ జాన్ ట్యూన్‌ను పోలి ఉందంటూ సోషల్ మీడియాలో తమన్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. దాంతో ప్రభాస్ అభిమానులు కూడా రియాక్ట్ అవుతూ, తమన్‌ను ద రాజా సాబ్ మూవీ నుంచి తీసేయాలంటూ #RemoveThamanFromRajasaab అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఈ చర్చ నడుస్తున్న క్రమంలోనే థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన సువ్వి సువ్వి సాంగ్ విడుదలైంది. ఇది కూడా కాపీ అని కొందరు అనుమానిస్తున్నారు.
ఈ మెలోడీ ట్రాక్ అందరికి నచ్చినప్పటికీ కొందరు మాత్రం ఇది హీరో నందు నటించిన సవారి సినిమాలోని ‘‘ఉండిపోవా నువ్విలా రెండు కళ్ల లోపల’’ అనే పాటను పోలి ఉందని పలువురు ట్వీట్లు చేస్తూ తమన్‌పై మళ్ళీ సెటైర్లు వేస్తున్నారు. షేఖర్ చంద్ర అందించిన ఆ మ్యూజిక్ అప్పట్లో ఎంతో ప్రశంసలు అందుకుంది. అయితే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సినిమాకి సంగీతం అందిస్తున్న తమన్ జాగ్రత్త తీసుకోకపోవడం పట్ల అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘‘ఒక స్టార్ హీరో సినిమా చేస్తున్నప్పుడు ఇలాంటివి కనీసం వెరిఫై చేయవలసిందే కదా?’’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే మరోవైపు, తమన్‌పై కావాలని ట్రోలింగ్ చేస్తున్నారని, ఇది ముందుగానే ప్లాన్ చేసిన నెగెటివ్ క్యాంపెయిన్ మాత్రమే అని కొంతమంది ఆయనను సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఓజీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదలకానుండగా, ఈ నెల 29 నుంచి యూఎస్ ప్రీమియర్స్‌కి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో , పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ విలన్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నారు.