Thaman | ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మరోసారి వార్తల్లో నిలిచారు. సంగీతంతో ప్రేక్షకుల మనసు దోచుకుంటూనే, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తో పాటు వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటారు. తాజాగా తమన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన తనకు తారసపడిన అరుదైన క్షణాన్ని అభిమానులతో పంచుకున్నారు. డల్లాస్ నుండి దుబాయ్‌కు వెళ్తున్న సమయంలో తనతో కలిసి ప్రయాణించిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురించి ట్వీట్ చేస్తూ, ఆయనతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గారితో డల్లాస్ నుంచి దుబాయ్ వరకు ప్రయాణించడం గొప్ప అనుభవం. ప్రయాణ సమయంలో మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సీసీఎల్ మ్యాచ్‌లలో నా బ్యాటింగ్ వీడియోలు చూపించాను. చూసిన వెంటనే సచిన్ ‘నీ బ్యాట్ స్పీడ్ అద్భుతంగా ఉంది’ అని ప్రశంసించారు. ఇది నా జీవితంలోని గొప్ప క్షణం. త్వరలోనే ఆయనతో కలిసి పని చేసే అవకాశం రావొచ్చు” అంటూ తమన్ పేర్కొన్నారు.తమన్ చివరిగా “త్వరలో కలిసి పని చేయొచ్చు” అనే వ్యాఖ్య నెటిజన్లలో ఆసక్తిని రేపుతోంది. దీనిపై సోషల్ మీడియాలో వివిధ ఊహాగానాలు వెలువడుతున్నాయి.
“సచిన్ సినిమాల్లో నటించనున్నారా?, తమన్ సచిన్ బయోపిక్‌కి సంగీతం అందించనున్నారా?, లేదా ఇద్దరూ ఏదైనా క్రికెట్ ప్రాజెక్ట్ కోసం కలవబోతున్నారా? అని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తమన్ కేవలం సంగీత దర్శకుడిగానే కాకుండా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) లో తెలుగు వారియర్స్ తరఫున క్రికెట్ ఆడుతూ తన బాటింగ్ టాలెంట్‌ను చూపించారు. చాలా మ్యాచుల్లో తన ఆటతో జట్టుకు విజయాన్ని అందించారు. ఇప్పుడు ఆయన బ్యాటింగ్ గురించి సచిన్ కూడా మాట్లాడటం తమన్‌కు మరింత గర్వకారణంగా మారింది. ఇటీవలే పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రానికి సంగీతం అందించి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా మార్చిన తమన్, ప్రస్తుతం ‘అఖండ 2: తాండవం’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ వంటి భారీ ప్రాజెక్టులకి పనిచేస్తున్నారు. ‘ఓజీ’లో తమన్ సంగీతం సినిమా విజయానికి కీలక కారణమైందని దర్శకుడు సుజీత్ ప్రత్యేకంగా అభినందించిన విషయం తెలిసిందే.