Thaman | తమిళులకు ప్రాంతీయాభిమానం ఎక్కువగా ఉంటుందనే మాట చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. అదే సమయంలో తెలుగువాళ్లకు అలాంటి ఐక్యత లేదన్న విమర్శలు కూడా తరచూ వినిపిస్తుంటాయి. ఈ అంశం మరోసారి చర్చకు రావడానికి కారణమయ్యారు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్. తమిళ–తెలుగు చిత్ర పరిశ్రమల మధ్య ఉన్న అవకాశాల తేడాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. తెలుగులో కార్తీ, సూర్య వంటి తమిళ హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు, తమిళనాట పెద్ద స్టార్ ఇమేజ్ లేని విజయ్ సేతుపతి సినిమాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు రాబడుతున్నాయి. కానీ అదే సమయంలో తెలుగులో సూపర్ స్టార్లుగా పేరొందిన మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమాలకు తమిళనాడులో కనీస స్థాయి కలెక్షన్లు కూడా రావడం లేదన్నది వాస్తవం.
ఈ వ్యత్యాసమే తమిళుల ప్రాంతీయాభిమానానికి నిదర్శనమని సినీ వర్గాలు అంటున్నాయి. హీరోలకే కాదు, తమిళ హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా తెలుగులో మంచి డిమాండ్ ఉంది. జీవీ ప్రకాశ్ కుమార్, అనిరుధ్ రవిచందర్ వంటి కోలీవుడ్ సంగీత దర్శకులు వరుసగా టాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లకు తమిళనాడులో అదే స్థాయిలో అవకాశాలు రావడం లేదన్నది పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనిరుధ్‌కు తెలుగులో చాలా ఈజీగా అవకాశాలు వస్తాయి. కానీ నాకు మాత్రం తమిళ సినిమాల్లో అవకాశం రావడం చాలా కష్టం. కారణం తమిళ ఇండస్ట్రీలో ఉన్న ఐక్యత. అక్కడ వాళ్లు తమవాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి ఐక్యత అస్సలు లేదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో అనిరుధ్ పారితోషికంపై కూడా రూమర్లు తెరపైకి వచ్చాయి. తమిళ్లో ఓ సినిమాకు సుమారు రూ.4 కోట్ల వరకు తీసుకునే అనిరుధ్, తెలుగులో మాత్రం రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేస్తాడనే ప్రచారం ఉంది. ‘దేవర’ వంటి సినిమాలు కూడా అనిరుధ్ మ్యూజిక్ కారణంగానే ఆలస్యంగా విడుదలయ్యాయనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ కూడా తన కెరీర్లో చాలా తక్కువ తెలుగు సినిమాలకే సంగీతం అందించారు. తెలుగులో టాప్ డైరెక్టర్ల నుంచి ఆఫర్లు వచ్చినా, ఆయన ఆసక్తి చూపలేదన్న మాటలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే, తమిళ ఇండస్ట్రీలో కనిపించే ఐక్యత, ప్రాంతీయాభిమానం వల్ల అక్కడి టెక్నీషియన్లు, కళాకారులు బలంగా నిలబడుతున్నారని, తెలుగులో మాత్రం అలాంటి సమైక్యత లేకపోవడం వల్ల మనవాళ్లకే నష్టం జరుగుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. తమన్ వ్యాఖ్యలతో ఈ అంశం ఇప్పుడు సినీ వర్గాల్లో మరోసారి పెద్ద చర్చగా మారింది.