Thalapathy Vijay | ఎంతో ఇష్టపడి ఆ కారును దిగుమతిచేసుకున్నాడు. దానికోసం కోర్టుల చుట్టూ తిరిగాడు. న్యాయమూర్తితో మొట్టికాయలు కూడా తిన్నాడు. అయితే కొన్నప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ స్టార్ హీరో ఇప్పుడు దానిని అమ్మకానికి పెట్టాడు. అతడెవరో కాదు.. తమిళ అగ్రహీరో దళపతి విజయ్. 2012లో ఎంతో ఇష్టంతో రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును కొనుగోలుచేశాడు. అత్యంత ఖరీదైన ఆ లగ్జరీ కారును అమెరికా నుంచి తెప్పించుకున్నాడు. అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో లోకల్ టాక్స్ కట్టలేదనే ఆరోపణలను ఎదుర్కొన్నాడు. దినిపై ఆయన కోర్టును కూడా ఆశ్రయించి భంగపడ్డారు. 2021, జూలై 13న ఆయన పిటిషన్‌ను తిరస్కరించిన మద్రాస్ న్యాయస్థానం.. విజయ్‌కు రూ.లక్ష జరిమానా కూడా విధించింది. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి కొవిడ్ రిలిఫ్ ఫండ్‌కు జమచేయాలని తీర్పునిచ్చింది. అయితే కారుకు సంబంధించి మొత్తం ట్యాక్స్ రూ.40 లక్షలు విజయ్ చెల్లించాడని ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది.
అయితే మరోసారి ఆ కారు వార్తల్లో నిలిచింది. విజయ్ ముచ్చటపడి కొనుక్కున్న ఖరీదైన కారు విక్రయానికి వచ్చిందనే విషయం ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది. దళపతి ఉపయోగించిన కారు అమ్మకానికి వచ్చింది అంటూ రోల్స్‌రాయ్స్ కారు ఫొటోను ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్షిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. దీని ధర రూ.2.6 కోట్లు అని, అయితే ఇది నిర్ణయిత ధర కాదని, వినియోగదారుడి అవసరాన్ని బట్టి మారుతుందని అందులో పేర్కొన్నది.
విజయ్ ప్రస్తుతం ‘గోట్’ చిత్రంలో నటిస్తున్నారు. సురేశ్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇదే ఆయన చివరి సినిమా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. త్వరలో పాదయాత్ర కూడా చేయనున్నారు.