వివాదాలతో విడుదలవ్వలేక భారీ సినిమాలు సైతం ప్రసవవేదన పడుతున్న రోజులివి. ఈ విషయంలో ‘అఖండ 2’ ఎదుర్కొన్న అవాంతరాల గురించి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో విడుదల కావాల్సిన తమిళ అగ్రహీరో విజయ ‘జగనాయకుడు’ కూడా సెన్సార్ సమస్యల వల్ల ఆగిపోయింది. కార్తీ తమిళ సినిమా ‘వా వాతియర్’ కూడా ఆర్థిక కారణాల వల్ల విడుదల కావాల్సిన తేదీలో విడుదల కాలేదు. ఆర్థిక సమస్యలన్నింటినీ దాటుకొని ఎట్టకేలకు ఈ నెల 14న తమిళనాట విడుదలై మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నది. ఇవన్నీ రిలీజ్‌లకు చెందిన సమస్యలైతే.. విడుదలై.. థియేటర్లలో ఆడి, చివరకు ఓటీటీ దగ్గర సమస్యల్లో చిక్కుకున్నది ధనుష్ ‘తేరే ఇష్క్ మే’ చిత్రం.
ఈ సినిమా తెలుగులో ‘అమరకావ్యం’ పేరుతో విడుదలై పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ నెల 23న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావాల్సివుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు చిక్కులు ఎదురయ్యాయి. గతంలో తాము నిర్మించిన ‘రాంఝానా’ చిత్రానికి కొనసాగింపుగా ‘తేరే ఇష్క్ మే’ చిత్రాన్ని నిర్మించారని, ఈ విషయంపై తమ అనుమతి తీసుకోలేదని ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఆరోపిస్తూ.. ఈ విషయంపై ముంబాయి హైకోర్టును ఆశ్రయించింది.
‘తేరే ఇష్క్ మే’ చిత్రాన్ని నిర్మించిన ‘కలర్ ఎల్లో’ సంస్థ, చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ కాపీరైట్ చట్టాన్నీ ఉల్లంఘించారని, ఈ కారణం వల్ల తమ ప్రతిష్టకు భంగం వాటిల్లినందుకుగాను రూ.84కోట్ల నష్టపరిహారం సదరు ‘కలర్ ఎల్లో’ సంస్థ నుంచి ఇప్పించాలంటూ ఇరోస్ సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. ‘రాంఝానా’లోని కొన్ని పాత్రలు కూడా ‘తేరే ఇష్క్ మే’లో కొనసాగాయని పిటీషన్లో ‘ఇరోస్ సంస్థ’ పేర్కొన్నది. ‘అఖండ 2’ వివాదానికి కూడా ఈ సంస్థ మద్రాస్ హైకోర్టులో వేసిన పిటీషనే కారణమన్న విషయం తెలిసిందే. మరి ఈ వివాదానికి ముగింపు ఎప్పుడో చూడాలి.