Thalapathy Vijay Jana Nayagan | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన సినీ ప్రస్థానానికి వీడ్కోలు పలుకుతూ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఓవర్సీస్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ సృష్టిస్తున్నాయి. కేవలం విదేశీ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం ఇప్పటివరకు రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గత కొంతకాలంగా ఈ సినిమా నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన దర్శకుడు హెచ్.వినోద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను ఈ వార్తలను ధ్రువీకరించను.. అలాగని కొట్టిపారేయను. ఇది కేవలం ఒక రీమేకా లేదా ఏదైనా చిత్రం నుంచి స్ఫూర్తి పొందిందా అనేది పక్కన పెట్టండి. ఇది పక్కా ‘దళపతి’ మూవీ. ప్రేక్షకులు ఆందోళన చెందకుండా థియేటర్లకు వచ్చి సినిమాను ఆస్వాదించండి” అని ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమా చుట్టూ ఉన్న సస్పెన్స్‌కు తెరదించుతూ చిత్ర బృందం రేపు (జనవరి 3) అధికారిక ట్రైలర్‌ను విడుదల చేయబోతోంది. ఈ ట్రైలర్ ద్వారా కథపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.