తమిళ, తెలుగు భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యువహీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన నటిస్తున్న తాజా ప్రేమకథా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నయనతార నిర్మించారు. కృతిశెట్టి కథానాయికగా నటించింది. బుధవారం ఈ సినిమా టీజర్‌ను హీరో రానా విడుదల చేశారు. ‘ప్రపంచం ఎక్కడికో వెళ్లిపోయింది.. మనం ఇప్పుడు 2040లో ఉన్నాం’ అనే వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో కథను డిజైన్ చేశాడని టీజర్‌ను చూస్తే అర్థమవుతున్నది. ‘లవ్ ఎట్ ఫస్ట్‌సైట్ అనేది ఇంకా ఉంది.. ఈ అమ్మాయిని చూడగానే అర్థమైంది’ అనే సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి. శ్రీపద్మిని సినిమాస్ ద్వారా ఈ సినిమా తెలుగు రాష్ర్టాల్లో విడుదల కానుంది. యోగిబాబు, సీమాన్, గౌరీ కిషన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవివర్మన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, రచన-దర్శకత్వం: విఘ్నేష్ శివన్.