టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య(92) కన్నుమూశారు. శనివారం హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సుదీర్ఘ నట ప్రస్థానంలో 300 పైచిలుకు చిత్రాల్లో నటించారాయన. బాలయ్య మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
నాటకరంగం నుంచి
గుంటూరు జిల్లా వైకుంఠపురం సమీపంలోని చావపాడు గ్రామంలో గురువయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు 1930, ఏప్రిల్ 9న జన్మించారు బాలయ్య. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకైన విద్యార్థిగా ఉంటూనే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. మద్రాస్ వెళ్లి ఇంజినీరింగ్ పూర్తి చేశాక రంగస్థలం నుంచి చిత్రరంగానికి ఆకర్షితులు అయ్యారు బాలయ్య. దర్శకుడు తాపీ చాణక్య రూపొందించిన ‘ఎత్తుకు పై ఎత్తు’ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశారు. ‘పార్వతీ కళ్యాణం’, ‘భాగ్యదేవత’, ‘పాండవ వనవాసం’, ‘బొబ్బిలి యుద్ధం’ వంటి చిత్రాలు ఆయనకు నటుడిగా పేరు తీసుకొచ్చాయి.
నిర్మాతగా
నటుడిగా స్థిరపడిన తర్వాత అమృత ఫిలింస్ సంస్థను స్థాపించి శోభన్ బాబు హీరోగా ‘చెల్లెలి కాపురం’, కృష్ణతో ‘నేరము శిక్ష’ లాంటి చిత్రాలను నిర్మించారు. రచయితగానూ బాలయ్య ప్రసిద్ధులు. ఆయన రాసిన పలు కథలు సినిమాలుగా తెరకెక్కాయి. దాదాపు పదిహేను చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు బాలయ్య. స్వీయ దర్శకత్వంలో ‘పసుపు తాడు’ ‘పోలీస్ అల్లుడు’ ‘ఊరికిచ్చిన మాట’ చిత్రాలను రూపొందించారు. ‘ఊరికిచ్చిన మాట’ చిత్రానికి ఉత్తమ రచయితగా, ‘చెల్లెలి కాపురం’ చిత్రానికి ఉత్తమ నిర్మాతగా నంది అవార్డులను అందుకున్నారు.
పౌరాణిక పాత్రల్లో..
శివుడు, కృష్ణుడు, ధర్మరాజు, బ్రహ్మ వంటి పౌరాణిక పాత్రలను ధరించి మెప్పించారు బాలయ్య. ముఖ్యంగా శివుడిగా తెలుగు తెరపై ఆయనకు ప్రత్యేక గుర్తింపు సొంతమైంది. పార్వతీ కళ్యాణం, భక్త కన్నప్ప, జగన్మాత, మోహినీ రుక్మాంగద, అష్టలక్ష్మీ వైభవం చిత్రాల్లో ఆయన శివుడు పాత్రలను ధరించి ఆకట్టుకున్నారు. ‘పెళ్లి సందడి’, ‘అన్నమయ్య’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ సినిమాలు ఈతరం ప్రేక్షకులకు ఆయనను దగ్గర చేశాయి. బాలయ్య 2012 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. ఆయన అంత్యక్రియలు శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి.