ప్రముఖ సినీగేయరచయిత కులశేఖర్(53) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. కులశేఖర్ జన్మస్థలం విశాఖ జిల్లా సింహాచలం. ఓ ప్రముఖ మీడియా సంస్థలో విలేకరిగా ఆయన కెరీర్ మొదలైంది. అనంతరం చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి, ఆర్పీ పట్నాయక్ స్వరపరిచిన చాలా పాటలకు సాహిత్యాన్ని అందించారు.
తేజా దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ ఆయనకు తొలి బ్రేక్‌ని ఇచ్చింది. ఆ తర్వాత జయం, ఔనన్నా కాదన్నా, వసంతం, ఘర్షణ, సుబ్బు.. ఇలా చాలా సినిమాకు కులశేఖర్ పాటలు రాశారు. ‘గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా..’, ‘రాను రాను అంటూనే చిన్నదో..’, ‘అందమైన మనసులో ఇంత అలజడెందుకో..’ సాంగ్స్ ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. కులశేఖర్ మరణం తెలుగు సినిమా సాహిత్యానికి తీరని లోటు అని పలువురు చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటించారు.