Telugu Hero: ఇవాళ (సోమవారం) దేశమంతా శ్రీరామ నామ జపం చేస్తున్నది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో ఈ మధ్యాహ్నం అంగరంగ వైభవంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇంతటి మహత్తరమైన రోజున తెలుగు హీరో సుహాస్ పండంటి బిడ్డకు తండ్రయ్యాడు. ఆయన భార్య లలిత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సుహాస్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించి.. అందరితో తన ఆనందాన్ని పంచుకున్నాడు.
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హీరో సుహాస్.. ఆ తర్వాత పలు సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేశాడు. ‘కలర్ ఫోటో’ సినిమాలో హీరోగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత సంవత్సరం ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాలోనూ సుహాస్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇతడు నటించిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది.
కాగా, సోమవారం (జనవరి 22న) తన భార్యకు మగబిడ్డ పుట్టినట్లు సుహాస్ తన ఇన్స్టా హ్యాండిల్లో వెల్లడించాడు. ఈ పోస్టుకు ‘ప్రొడక్షన్ నం.1’ అంటూ ఓ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ఇదిలావుంటే సుహాస్, లలితలది ప్రేమ వివాహం. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్నారు. లలిత తనకు భార్య అయిన తర్వాత చాలా కలిసొచ్చిందని సుహాస్ పలుమార్లు చెప్పాడు.