‘రేయ్.. చక్రీ టైమ్ ఎంతరా?’ ‘పదిన్నర… ఎందుకు?’ ‘ఎందుకేంట్రా..ఈ రోజు ఇంద్ర సినిమాకి వెళ్లాలి’ ‘ఏంట్రోయ్.. బుర్రలో చిప్ దొబ్బిందా? ఇది 2002 కాదు. 2024’ ‘అబ్బా చా.. మాకు తెలియదు మరి.నాతో రా..’ అని బిట్టు బైక్ స్టార్ట్ చేశాడు. 15 నిమిషాల్లో థియేటర్‌కి వెళ్లిపోయారు.. బండి పార్కింగ్‌లో పెట్టేశారు.. ‘రేయ్.. పద పదా.. ఇంద్ర ఎంట్రీ సీన్ మిస్ అవ్వకూడదు..’ ‘ఇంద్ర ఏంటి? పీవీఆర్‌లో ఈ పరుగులేంటి?’ అని మనసులో అనుకుంటూ స్క్రీన్-2 డోర్ తీశాడు.. అంతే..
Re Release | కాలయంత్రం పీఛేముడ్ అన్నది..ఓ 22 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లింది.. ఫ్యాన్స్ బెనిఫిట్ షో మాదిరిగా.. అరుపులు.. విజిళ్లు.. కాగితాలు.. ‘ఇంద్ర’ అని టైటిల్ పడగానే.. థియేటర్ దద్దరిల్లింది.. చక్రికి.. ఏం అర్థం కాలేదు.టైమ్ ట్రావెల్లో 2002కి వెళ్లినట్టే ఉంది. ఓ మూడు గంటలు.. సినిమా అయిపోయింది..డోర్ తీసుకుని బయటికి వచ్చారు.. సెల్ఫీలు.. సినిమా గురించి ఫ్యాన్స్ ముచ్చట్లు.. రీల్స్.. ఫోన్లో చూస్తే.. #Rerelease పోస్ట్‌లు.. హ్యాపీ బర్త్ డే టు మెగాస్టార్ అని మెసేజ్‌లు..
యస్.. ఒక్క చక్రికి మాత్రమే కాదు. తెలుగు సినిమా రీ-రిలీజ్ ట్రెండ్‌తో అందరు హీరోల ఫ్యాన్స్ టైమ్ ట్రావెల్ చేస్తున్నారు. అభిమాన హీరో సినిమాను మరోసారి.. 70 ఎంఎం స్క్రీన్‌పై చూస్తూ సందడి చేస్తున్నారు. అప్పటి కథల్లో మరోసారి తమ అభిమాన హీరోను తనివి తీరా చూసుకుంటున్నారు.. వాళ్ల నటనకు మురిసిపోతున్నారు.. స్టెప్పులకు సలామ్ చేస్తున్నారు. మరైతే.. రీ-రిలీజ్ ట్రెండ్‌తో రిఫ్రెష్ అవుతున్న ఫ్యాన్స్ మూవ్మెంట్స్ వెనకున్న ముచ్చట్లు.. అలనాటి ఆల్‌టైమ్ హిట్స్ వెనకున్న సంగతులు.. సక్సెస్ ఫార్ములాలు ఏమై ఉంటాయి? ఈ రీ-రిలీజ్‌లను నేటి తరం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇప్పుడు తీస్తున్న సినిమాలు మరో 20 ఏండ్ల తర్వాత మళ్లీ విడుదల అవుతాయా? రండి.. ఓ సారి ఈ రీ-రిలీజ్ సంగతుల్ని రీకాల్
చేసుకుందాం.
సినిమా మారదు.. కథలే మారేది
నిడివి ఎంతైనా.. భాష ఏదైనా.. హీరోలు.. డైరెక్టర్లు ఎవరైనా.. సినిమా కోసమే తపిస్తారు. సో.. సినిమా అదే! కథలు.. పాత్రలే మారాయ్.. మారుతున్నాయ్!! కొత్త నటులూ పుట్టుకొచ్చారు. ఇదే మాదిరిగా.. ప్రేక్షకులూ మారరు! మారేది వాళ్ల ఎమోషన్లే. కొన్నిసార్లు సినిమాలకు సంబంధించిన డిస్కషన్స్‌లో ‘ప్రేక్షకులు మారిపోయారు’ అనడం వింటుంటాం. అలా మారిపోతే.. రీ-రిలీజ్ సినిమాలను ఇంతలా ఆదరిస్తారా? కచ్చితంగా కన్నెత్తి పోస్టర్ కూడా చూడరు!! దశాబ్దాలు దాటిపోయినా.. పుష్కరాలు గడిచిపోయినా.. అలనాటి ప్రేక్షకుడిని అప్పటి కథలు.. పాత ఆవకాయలా ఊరిస్తూనే ఉంటాయి.
ఇప్పటి తరానికి కొత్త ఆవకాయలా ఆ పాత పరిమళాల్ని వెదజల్లుతూ ఉంటాయి. మన తెలుగు హీరోలు.. అమ్మ.. ఆవకాయ.. ఎప్పుడూ బోర్ కొట్టే ప్రసక్తే లేదు. అందుకే.. రీ-రిలీజుల్లో ఆ జోష్!!! చిరు స్టెప్పేసినా.. బాలయ్య డైలాగ్ చెప్పినా.. పవర్ స్టార్ ఫైట్ చేసినా.. నాగార్జున ైస్టెల్ చూపినా.. మహేష్‌బాబు ముద్దొచ్చేలా యాక్ట్ చేసినా.. ఫ్యాన్స్‌కి పూనకాలే. అంతేనా.. నేటి టెక్నాలజీని వాడుకుని 4కే హంగులు, డాల్బీ మిక్సింగ్‌లు జోడిస్తూ.. అలనాటి సినిమాల్ని ఇప్పటి సిల్వర్ స్క్రీన్‌కి మ్యాచ్ చేస్తున్నారు. ఇక
సినిమా లవర్స్‌కి పండుగే కదా!!
Oye
తీసేవారికి పాఠం.. చూసేవారికి సినిమా!
ఒక సినిమా తీయాలంటే ఓ డైరెక్టర్ కొన్నేండ్లపాటు 24 క్రాఫ్ట్‌లను చదవాలి. అసిస్టెంట్‌గా మొదలెట్టి.. అసోసియేట్‌గా ఐదారు సినిమాలకు పనిచేయాలి. ఇక హీరోలైతే చాలానే చేయాలి. లేనివి అలవర్చుకోవాలి.. ఉన్నవి మెరుగుపరుచుకోవాలి. ప్రొడ్యూసర్ల పరిస్థితి చెప్పడానికి మాటలు సరిపోవు.. కుటుంబాల్ని.. ఆస్తుల్ని పణంగా పెట్టడమే! ఎన్నో మార్పులు, చేర్పులు.. నిద్రలేని రాత్రులు గడపాలి. ఇవన్నీ కుదిరితే హిట్ పక్కా! అలా కుదిరిన సినిమానే ‘ఇంద్ర’. మెగాస్టార్‌కి మర్చిపోలేని కమర్షియల్ హిట్. కథా రచయితలు, డైలాగ్ రైటర్లు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్.. అనుభవాలు నేటి తరం ఫిల్మ్ మేకర్లకు పాఠాలు.
రీ-రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం ఇంటర్య్వూలు చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. అప్పట్లో సినిమాల్ని అంత త్వరగా ఎలా ఫినిష్ చేసేవాళ్లు.. అప్పుడున్న టెక్నాలజీ సినిమాకి ఎలా హెల్ప్ అయ్యింది.. లాంటి వివరాల్ని వెటరన్ ఫిల్మ్ పండితులు చెబుతుంటే నేటి తరానికి ఆశ్చర్యం కలుగుతున్నది. కొన్ని వందల సినిమాలకు కథలు, మాటలు రాసిన పరుచూరి బ్రదర్స్ చిరంజీవి సక్సెస్ గురించి చెబుతూ ఖైదీ సినిమాలోని డైలాగ్ గుర్తుచేశారు.. ‘కోటిపల్లికి దారెటని.. కొండపల్లి వెళ్తున్నావ్’ అని రంగనాథ్ అడిగితే.. చిరంజీవి ‘మనసు మార్చుకున్నా’ అని చెబుతాడు. ‘మీరు నటుడు అవుదాం అని వచ్చి.. మనసు మార్చుకుని మహానటుడు అయ్యారు’ అని పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పడం ఎంతో పరిపూర్ణమైన కాంప్లిమెంట్.
అప్పుడు కాదు.. ఇప్పుడు నచ్చుతున్నాయ్
డైరెక్టర్.. హీరో.. ప్రొడ్యూసర్.. ఈ ముగ్గురి చొరవతోనే కథ ఓకే అవుతుంది. సినిమా పూర్తవుతుంది. ప్రమోషన్స్‌కి ప్రాణం పెడతారు. హిట్టు కొట్టేస్తున్నాం అని నమ్ముతారు. కానీ, రిజల్ట్ తేడా వస్తుంది. అలా హిట్ అనుకున్నవి అప్పుడు ఫట్ అయినవి ఎన్నో. కానీ, ఈ రీ-రిలీజ్ ట్రెండ్‌తో మళ్లీ విడుదలై ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పించి.. మెప్పించిన సినిమాలు కొన్ని ఉన్నాయి.
వాటిలో రామ్‌చరణ్
‘ఆరెంజ్’ మొదటి వరుసలో ఉంటుంది. గత ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మళ్లీ విడుదలైంది. ఈ దఫా సినిమాలో పాటలే కాదు.. కథ కూడా నేటి తరానికి బాగా కనెక్ట్ అయ్యింది. నిజానికి ‘ఆరెంజ్’ స్టోరీలైన్ ఇప్పటితరానిదే. పుష్కరకాలానికి ముందే పుట్టేసి కాస్త కన్ఫ్యూజ్ క్రియేట్ చేసింది. ఇంకా చెప్పాలంటే.. ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా ‘ఓయ్’ సినిమా రీ-రిలీజ్ అయింది. లవర్‌బాయ్ ఇమేజ్‌తో ఫుల్‌స్వింగ్‌లో ఉన్న సిద్ధార్థ్‌కి ‘ఓయ్’ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. విషాదాంత చిత్రాలను మరచిపోయిన తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాలో కథానాయిక కన్నుమూయడాన్ని అప్పుడు జీర్ణించుకోలేకపోయారు. దాదాపు 14 ఏండ్ల తర్వాత మళ్లీ విడుదలైన ‘ఓయ్’ని నేటితరం ప్రేమపక్షులు ఎగబడి చూశారు. మ్యూజిక్‌ను ఎంజాయ్ చేశారు. కథను యాక్సెప్ట్ చేశారు.
గుర్తుకొస్తున్నాయి!!
వారానికో ట్రెండ్ మారుతున్న ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాం మనం. అయినా.. ఎప్పుడో 23 ఏండ్ల కిందట పవన్ కళ్యాణ్ వేసుకున్న ఖుషి బ్యాగ్‌లు ఎవరికి గుర్తున్నాయ్? 2కేలో.. టీనేజ్ ప్రాయంలో ఆ బ్యాగులు.. చెవిలో వాక్‌మ్యాన్ ఇయర్ ఫోన్లు పెట్టుకుని.. ‘ఆడువారి మాటలకూ.. అర్థాలే వేరులే..’ అని గడిపిన రోజులు.. రీ-రిలీజ్‌తో మరోసారి కండ్లముందుకు వచ్చాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా.. నేటి తరాన్ని అప్పటి నటుల మేనరిజం, వారి తాలూకు ైస్టెల్స్ కచ్చితంగా ఆకట్టుకుంటాయి. కావాలంటే.. మురారి సినిమాలో మహేష్‌బాబుకి ఇప్పటి మహేష్‌కి తేడాని చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే.. డైరెక్టర్ కృష్ణవంశీ మేకింగ్ ైస్టెల్ ఈ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్‌కి ‘మురారి’ ఓ క్లాసిక్‌గా చెప్పొచ్చు. ముఖ్యంగా.. ‘అలనాటి బాలచంద్రుడి..’ పాట లేని పెండ్లి అల్బమ్ ఉండదేమో!!
ట్రెండ్ కంటిన్యూ..!
కరోనా కారణంగానో.. భారీ సినిమాల షెడ్యూల్స్ వల్లో.. హీరోల నిర్ణయాల వల్లో.. నెలలు, ఏళ్ల గ్యాప్‌ని ఫిల్ చేయడానికి కూడా రీ-రిలీజ్లు శుభపరిణామం అనొచ్చు. దేశ, విదేశాల్లోని అభిమానులు.. ఈ రీరిలీజ్‌లతో రిఫ్రెష్ అవుతున్నారు. ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ సినిమాని థియేటర్లలో చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ‘గబ్బర్ సింగ్’ రీరిలీజ్‌కి సిద్ధం అవుతున్నది. పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న థియేటర్లలోకి వస్తున్నది. ఈ మళ్లీ విడుదలలు కేవలం తెలుగు సినిమాకు మాత్రమే పరిమితం కాదు. దేశంలోని వివిధ భాషల్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తున్నది. అంతేకాకుండా, కొన్ని సినిమాలకు రీ-రిలీజ్ తర్వాత వచ్చిన వసూళ్లు, అవి మొదటిసారి విడుదలైనప్పుడు వచ్చిన వసూళ్ల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. టాలీవుడ్లో రీ-రిలీజ్లు ఇప్పుడో కొత్త ధోరణి. ఇది కేవలం సినిమాను మరోసారి చూడటం మాత్రమే కాదు, తెలుగు సినీ సంస్కృతిని కాపాడటం, పరిరక్షించడం కోసం చేసే ప్రయత్నం. భవిష్యత్తులో మరెన్నో క్లాసిక్ సినిమాలు రీ-రిలీజ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తాయని ఆశిద్దాం.
మొత్తంగా రీ-రిలీజ్ ట్రెండ్ ముదిరి పాకాన పడుతున్నది. స్టార్‌హీరోల పుట్టినరోజు సందర్భంగా… వాళ్లు నటించిన పాత సినిమాలు కొత్తగా మళ్లీ విడుదల అవుతున్నాయి. విజయం సాధిస్తున్నాయి. నోస్టాలజీకి జీ హుజూర్ అనే వెటరన్లు, ఆ పాత సినిమాలో ఏముందో చూద్దాం అనుకునే యంగ్ ప్రేక్షకులు.. అందరూ ‘మళ్లీ విడుదల’ అనగానే ‘చూసేందుకు రెడీ’ అని సిద్ధమవుతున్నారు.
రీ-రిలీజ్లో టాప్ కలెక్షన్లు
రీ-రిలీజ్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఖుషీ’ మూవీ మంచి వసూళ్లనే సాధించింది. మొదటి రోజు రూ.4.51 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా రూ.7.46 కోట్ల గ్రాస్ రాబట్టి రీ-రిలీజ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు సాధించింది. సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బిజినెస్ మేన్’ మళ్లీ విడుదలలో మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.3 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చిన ‘సింహాద్రి’ రీరిలీజ్‌లో ఫస్ట్ డే రూ.4.01 కోట్లు రాబట్టింది. చిన్న సినిమానే అయినా.. విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ రీ-రిలీజ్లో రూ.1.78 కోట్లు కలెక్ట్ చేసింది.
…? రాజేష్ యడ్ల