కార్మికుల సమ్మె కారణంగా గత రెండువారాలుగా సినిమా షూటింగులు బంద్ అయిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలపై ప్రముఖ నటుడు చిరంజీవితో చిన్న నిర్మాతలు భేటీ అయ్యారు. సమ్మె కారణంగా చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చిరంజీవికి విన్నవించారు. ఆదివారం ఎంప్లాయిస్ ఫెడరేషన్తో కూడా మాట్లాడతానని, సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రయత్నిస్తానని చిరంజీవి హామీ ఇచ్చినట్టు చిన్న నిర్మాతలు తెలిపారు. ఇదిలావుంటే.. ఆదివారం చిరంజీవితో అగ్ర నిర్మాత సి.కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్, నిర్మాతలు.. వీరంతా కలిస్తేనే సినిమా అనీ, తానెప్పుడు సినీపరిశ్రమ బాగుండాలనే కోరుకుంటానని, సినిమాకు సంబంధించి నిర్మాతే కీలకమని, తన వంతుగా కార్మికులతో మాట్లాడతానని, ఇరువర్గాలకూ న్యాయం జరిగేలా చూస్తానని చిరంజీవి చెప్పిన్నట్టు సి.కల్యాణ్ పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ ‘లేబర్ కమిషన్ రూల్స్ ప్రకారం పనిచేయడం మొదట్నుంచీ ఇక్కడ లేదు. ఓ కుటుంబంలా పనిచేయడం సినీఇండస్ట్రీకి అలవాటైపోయింది. నిజానికి కార్మికశాఖ పేర్కొన్న వేతనాల కన్నా కార్మికులకు ఎక్కువే ఇస్తున్నాం. శాఖా నిబంధనల ప్రకారం అయితే భోజనాలు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఖర్చెంతైనా భరిస్తూ కార్మికులకు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం.
ముఖ్యంగా ఈ సమ్మె కారణంగా చిన్న నిర్మాతలు నలిగిపోతున్నారు. ఏడాదిలో సుమారుగా 300 సినిమాలు నిర్మితమైతే, వాటిలో 60 సినిమాలు మాత్రమే పెద్ద సినిమాలుంటాయి. మిగతావన్నీ చిన్న సినిమాలే. కార్మిక సంఘాలు ఈ విషయాన్ని గమనించాలి.’ అని సి.కల్యాణ్ అన్నారు. అయితే.. నిర్మాతల వాదనలను కార్మిక సంఘాలు కొట్టిపారేశాయి. ఫెడరేషన్ ముందుంచిన నిర్మాతల వర్కింగ్ కండీషన్స్‌లో రెండు అభ్యంతరకరంగా ఉన్నాయని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. రేపు చిరంజీవితో ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమావేశం కానున్నది. చిరంజీవి కార్మికుల పక్షాన నిలుస్తారని, తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని కార్మికసంఘాలు భావిస్తున్నాయి. మంగళవారం అటు నిర్మాతలతో, ఇటు ఫెడరేషన్తో ఏకకాలంలో చిరంజీవి భేటీ అయ్యే అవకాశం ఉంది. చిరంజీవి జోక్యంతో పరిస్థితులు చక్కబడతాయని ఇరు వర్గాలూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.