తెలుగు సినిమా స్వర్ణయుగంలో కృష్ణవేణి, సావిత్రి, భానుమతి, విజయనిర్మల వంటి అగ్ర తారలు కేవలం నటనకే పరిమితం కాకుండాసినీ నిర్మాతలుగా కూడా రాణించారు. తమ అభిరుచుల మేరకు సినిమాలు తీసి మంచి విజయాల్ని అందుకున్నారు. ఆ తర్వాత కాలం నుంచి ఫిల్మ్ ప్రొడక్షన్స్‌లో కథానాయికల ప్రాతినిధ్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. తాజా పరిణామాలను గమనిస్తే ఒకప్పటి ట్రెండ్ పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తున్నది. సమంత, నయనతార, నిత్యా మేనన్, వరలక్ష్మి శరత్‌కుమార్‌తో పాటు మరికొందరు కథానాయికలు ప్రస్తుతం సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమకు నచ్చిన కథల్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు కొత్త బ్యానర్లను స్థాపిస్తున్నారు.
సినిమా డెస్క్ : పవర్ఫుల్ పెర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవలే ‘సరస్వతి’ సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో తాను టైటిల్ రోల్‌ని పోషించడమే కాకుండా సోదరి పూజతో కలిసి చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంది. తాజాగా అదితిరావు హైదరీ సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. త్వరలో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించడానికి ఆమె సన్నాహాలు చేస్తున్నది.
వ్యక్తిగత జీవితంలోని ఒడుదొడుకులు, అనారోగ్య సమస్యల కారణంగా దాదాపు రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అగ్ర కథానాయిక సమంత గతేడాది ‘శుభం’ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ట్రాలాలా మోషన్ పిక్చర్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి తొలి ప్రయత్నంగా హారర్ కామెడీ జోనర్లో ‘శుభం’ సినిమాను తెరకెక్కించింది. ఇందులో ఆమె అతిథి పాత్రలో కూడా మెరిసింది. పరిమిత ఆర్థిక వనరుల్లోనే చక్కటి నాణ్యతతో సినిమాను పూర్తిచేసింది సమంత. ‘శుభం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. సమంతకు ఓ మోస్తరు లాభాల్ని కూడా తెచ్చి పెట్టింది. ప్రస్తుతం సమంత స్వీయ నిర్మాణ సంస్థలో కథానాయికగా నటిస్తూ ‘మా ఇంటి బంగారం’ పేరుతో క్రైమ్ కామెడీ సినిమాలో నటిస్తున్నది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమా విజయంపై ధీమాగా ఉంది సమంత.
దక్షిణాది సినీరంగంలో విలక్షణ కథానాయికగా పేరు తెచ్చుకుంది మలయాళీ సోయగం నిత్యా మేనన్. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్‌కు దూరంగా అభినయ ప్రధాన పాత్రల్లో మెప్పించింది. అయితే గత కొంతకాలంగా కథానాయికగా ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. సినిమాల ఎంపికలో ఈ భామ సెలెక్టివ్‌గా ఉండటమే అందుకు కారణమని చెబుతారు. నటనకు కాస్త విరామం తీసుకున్న నిత్యా మేనన్ ఇటీవలే
‘కేయూరి’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఆరంభించింది. తన అభిరుచులకు తగినట్లు ప్రయోగాత్మక ఇతివృత్తాలతో సినిమాలు తీయబోతున్నానని ప్రకటించింది. పరిమిత బడ్జెట్లో ఏడాదికి రెండుమూడు చిత్రాలు తీయడమే తన లక్ష్యమని తెలిపింది. తెలుగులో ‘స్కైలాబ్’ చిత్రానికి నిత్యా మేనన్ సహ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. నిర్మాతగా ఈ పూర్వ అనుభవంతోనే ఆమె కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను మొదలుపెట్టిందని అంటున్నారు.
ప్రస్తుతం దక్షిణాదిలో బిజీయెస్ట్ కథానాయిక ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు నయనతారదే. ప్రస్తుతం ఆమెకు దక్షిణాది నాలుగు భాషల్లో చేతినిండా సినిమాలున్నాయి. ఇంత బిజీలో కూడా ఈ లేడీ సూపర్‌స్టార్ ఫిల్మ్ ప్రొడక్షన్స్‌లో సత్తాచాటుతున్నది. భర్త విఘ్నేష్‌శివన్‌తో కలిసి నెలకొల్పిన రౌడీ పిక్చర్స్ సంస్థ విభిన్న కథా చిత్రాల్ని తెరకెక్కిస్తూ పేరు తెచ్చుకుంది. ఈ సంస్థలో తెరకెక్కిన పెబల్స్, రాఖీ, నెట్రికన్, కాథువాకుల రెండు కాథల్, కనెక్ట్ వంటి చిత్రాలు ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల్ని మెప్పించాయి. ప్రస్తుతం ఈ బ్యానర్లో నాలుగు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.
కథానాయికగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఒక మనసు, సూర్యకాంతం వంటి చిత్రాల్లో ఆమె అభినయానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. నటనకు కొంచెం బ్రేక్‌నిచ్చిన నిహారిక ప్రస్తుతం ప్రొడక్షన్ మీద పూర్తిగా దృష్టి పెట్టింది. సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. సందేశాత్మక కంటెంట్‌తో అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నిహారిక తన బ్యానర్లో ‘రాకాస’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నది. హారర్ కామెడీ కథాంశమిది. సంగీత్ శోభన్, నయన్సారిక జంటగా నటిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
బాలీవుడ్లో ప్రయోగాత్మక, సామాజిక కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది తాప్సీ. ఈ భామ అవుట్‌సైడర్ ఫిల్మ్స్ పేరుతో 2021లో ఓ నిర్మాణ సంస్థను స్థాపించి బ్లర్, ధక్ ధక్ వంటి ప్రశంసాత్మక చిత్రాలను నిర్మించింది. ఇదే వరుసలో మరికొంత మంది కథానాయికలు నిర్మాతలుగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇటీవలి కాలంలో సినీ నిర్మాణంపై కథానాయికల ఆసక్తి పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. హీరోలతో పోల్చితే కథానాయికల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ఒక్క ఏడాదిలోనే పదుల సంఖ్యలో కొత్త నాయికలు ఎంట్రీ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో అగ్ర కథానాయికలు సినీ నిర్మాణాన్ని ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారు. ఒకవేళ నాయికగా అవకాశాలు తగ్గినా ప్రొడక్షన్ ద్వారా ఆర్థిక భరోసా లభిస్తుందన్నది వారి ఆలోచన. ఇక మరికొందరు కథానాయికలేమో తమ మనసుకు నచ్చిన సినిమాలు నిర్మించే లక్ష్యంతో ప్రొడక్షన్లోకి అడుగుపెడుతున్నారు.