Telugu Film Chamber | హైదరాబాద్ సినీ వర్గాల్లో ఉత్కంఠ రేపిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చిత్ర పరిశ్రమలోని వివిధ వర్గాల ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఫిల్మ్ నగర్ సందడిగా మారింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటును వేశారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, సాయంత్రం 6 గంటల కల్లా విజేతలు ఎవరనేది అధికారికంగా వెల్లడికానుంది.
ఈసారి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల బరిలో రెండు ప్రధాన ప్యానళ్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. పరిశ్రమలోని అగ్ర నిర్మాతలంతా ఏకమై ‘ప్రొగ్రెసివ్ ప్యానల్’ తరపున అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, చిన్న నిర్మాతల గళాన్ని వినిపిస్తూ వారి సమస్యలే ప్రధాన ఎజెండాగా ‘మన ప్యానల్’ పోటీకి దిగింది. పెద్ద నిర్మాతల ఆధిపత్యం ఒకవైపు, చిన్న సినిమాల మనుగడ కోసం పోరాడుతున్న నిర్మాతలు మరోవైపు నిలవడంతో ఈ ఎన్నికల ఫలితాలు ఇండస్ట్రీలో ఎవరి బలాన్ని చాటుతాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో మొత్తం 3,355 మంది సభ్యులు ఉండగా, ఈ ఎన్నికల ద్వారా నూతన అధ్యక్షుడిని, కార్యదర్శిని మరియు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గం 2027 వరకు బాధ్యతల్లో కొనసాగనుంది. పరిశ్రమ సమస్యల పరిష్కారం, థియేటర్ల వ్యవస్థ మరియు నిర్మాణ రంగంలోని సవాళ్లపై ఈ కొత్త కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.