23 Movie | ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించిన సామాజిక చిత్రం 23 (23 Iravai Moodu) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో జరగనున్న ప్రతిష్టాత్మక ‘హ్యాబిటాట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’కు ఈ చిత్రం అధికారికంగా ఎంపికైంది. గతంలో ‘మల్లేశం’, ‘8 AM మెట్రో’ వంటి సామజిక చిత్రాలను రూపొందించిన రాజ్ రాచకొండ, ఈసారి వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక బలమైన కథతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ముఖ్యంగా 1991 చుండూరు ఊచకోత, 1993 చిలకలూరిపేట బస్సు దహనం మరియు 1997 జూబ్లీహిల్స్ బాంబు పేలుళ్లు వంటి యదార్థ సంఘటనల సమాహారంగా ఈ సినిమా రూపొందింది.
సామాజిక అశాంతి, కుల వివక్ష మరియు న్యాయ వ్యవస్థలోని లోపాలను చర్చిస్తూనే, ఒక సున్నితమైన ప్రేమకథను ఇందులో చూపించారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రతిష్టాత్మక ‘గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డు’ను కైవసం చేసుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో తేజ, తన్మయి, పావొన్ రమేష్ మరియు ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా స్క్రీనింగ్ మే 22, 2026న సాయంత్రం 4:00 గంటలకు న్యూఢిల్లీలోని స్టెయిన్ ఆడిటోరియంలో జరగనుంది. ఈ ప్రదర్శనకు ప్రవేశం ఉచితం అయినప్పటికీ, ఆసక్తి గల వారు ఇండియా హ్యాబిటాట్ సెంటర్ అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని చిత్రబృందం తెలిపింది.