Telugu Debut Heroines 2024 | ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తగా నటీమణులు చాలామంది ఎంట్రీ ఇచ్చారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి టాలీవుడ్లోకి వచ్చిన ముద్దుగుమ్మల సంఖ్య ఎక్కువగానే ఉన్నది. దాదాపు 15 మందికిపైగానే తెలుగు సినిమాల్లో మెరిశారు. ఇందులో అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ సైతం ఉన్నది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, మాజీ మిస్‌వరల్డ్ మానుషీ చిల్లర్, భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణి వసంత్‌తో పాటు పలువురు తెలుగు తెరకు పరిచయమయ్యారు. వారంతా అందచందాలతో పాటు నటనతో అభిమానులను ఫిదా చేశారు. ఇంతకీ ఆ తారలెవరో చూసేద్దాం రండి..!
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకొనే తొలిసారి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీలో నటించింది. సుమతి పాత్రలో గర్భవతిగా డిఫరెంట్ రోల్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై.. భారీ కలెక్షన్స్‌ని రాబట్టింది.
అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసింది జాన్వీ కపూర్. సినీరంగ ప్రవేశం చేసిన దాదాపు ఆరేళ్ల తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో ధడక్ మూవీలో తొలిసారిగా నటించింది. అప్పటి జాన్వీ తెలుగు సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ ఏడాది ‘దేవర’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో దేవర-1లో తంగం పాత్రలో మెరిసింది.
ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమైన మరో అందం భాగ్యశ్రీ బోర్సే. రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మోడల్‌గా భాగ్యశ్రీ కెరియర్ను ప్రారంభించింది. బాలీవుడ్లో రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ యారియాన్-2తో బిగ్ స్క్రీన్కు పరిచయమైంది. ఇందులో రాజ్యలక్ష్మి కరియప్ప పాత్ర పోషించింది. భాగ్యశ్రీ బోర్సే నటనకు ఫిదా అయిన హరీశ్ శంకర్ మిస్టర్ బచ్చన్‌లో ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీలో భాగ్యశ్రీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. జిక్కి పాత్రకు భాగ్యశ్రీ డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
2017 మిస్ వరల్డ్‌గా నిలిచిన మానుషి చిల్లర్ సైతం ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమయ్యారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్లో హీరోయిన్గా నటించారు. తెలుగు, హిందీల్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచమయ్యారు. మానుషి ఈ మూవీలో కమాండర్ పాత్రలో ఆకట్టుకున్నారు. వరుణ్‌కు హిందీలో ఇదే తొలి సినిమా. వాస్తవ ఘటన ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలైంది.
ఈ ఏడాది టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరోయిన్ రుక్మిణీ వసంత్. గతేడాది తెలుగులో కన్నడ చిత్రం ‘సప్తసాగరాలు దాటి’ ఫ్రాంచైజీలో నటించింది. తొలిసారిగా కన్నడ సోయగం నిఖిల్ సరసన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ నవంబర్ 8న విడుదలైంది. ఈ భామ ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న మూవీలో హీరోయిన్గా ఎంపికైంది.
తమిళ బ్యూటీ ప్రీతి ముఖుందన్ సైతం ఈ సారి టాలీవుడ్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీవిష్ణు, ప్రియదర్శి నటించిన ఓం భీమ్ భుష్ మూవీలో నటించింది. హర్ష దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మించిన ఈ మూవీ మార్చిలో విడుదలైంది. కెవిన్ హీరోగా ‘స్టార్’ మూవీతో ఇదే ఏడాది తమిళ ఇండస్ట్రీకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగు మరో సినిమాలోనూ నటిస్తున్నది. మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీలో కనిపించనున్నది.
మలయాళీ బ్యూటీ అతిరా రాజ్ 2021లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో వీరన్, అమిగో గ్యారేజ్‌లో నటించిన ఈ బ్యూటీ ఈ ఏడాది తెలుగులో ‘కృష్ణమ్మ’ మూవీలో మెరిసింది. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ మూవీకి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నటనతో అందరి ప్రశంసలు పొందింది. సినిమాల్లోకి రాక ముందు అతిరా రాజ్ మోడల్‌గా చేసింది.
పంఖురి గిడ్వాని మెడల్‌గా కెరియర్ ప్రారంభించింది. 2016లో ఫెమినా మిస్ ఇండియా సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. 2019లో ఉజ్దా చమాన్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తొలిసారిగా నవదీప్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా ‘లవ్ మౌలి’తో తెలుగులోకి అరంగేట్రం చేసింది. ఈ మూవీకి అవనీంద్ర దర్శకత్వం వహించారు.
ప్రతినిధి-2 మూవీతో సిరి లెల్ల తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలుత మోడల్‌గా కెరియర్ను ప్రారంభించింది. మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహించిన ప్రతినిధి-2తో తెలుగు సినిమాలో అడుగుపెట్టింది. పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధికి సీక్వెల్‌గా తెరకెక్కగా.. నారా రోహిత్ హీరోగా నటించారు. ఆమె హీరో నారా రోహిత్‌ను పెళ్లి చేసుకోనున్నారు. ఇటీవల రోహిత్‌తో సిరి లెల్ల వివాహం నిశ్చయమైంది.
తమిళ బ్యూటీ సంయుక్త విశ్వనాథన్ సైతం టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళనాడు చెన్నైలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. సంయుక్త ఎంగా హాస్టల్, స్వీట్ కారం కాఫీ, ఓహ్ మనపెన్నె, మోడరన్ లవ్ చెన్నై తదితర చిత్రాల్లో నటించింది. తెలుగులో స్పై యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చారి 111తో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ మూవీలో వెన్నెల కిశోర్ హీరోగా నటించగా.. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు.
మంగుళూరు బ్యూటీ యషా శివకుమార్ సైతం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిసారిగా శాండల్‌వుడ్‌లో మాన్సూర్ రాగ.. భైరాగీ మూవీస్‌లో నటించింది. ఈ ఏడాది తెలుగులో సాయిరామ్ శంకర్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా వెయ్ ధరువెయ్ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సాయితేజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మూవీని నిర్మించగా.. నవీన్ రెడ్డి దర్శకత్వం వహించారు.
మలయాళ నటి అన్నా బెన్ సైతం ఈ ఏడాది తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కీ ఏడీ 2898 మూవీలో నటించింది. ఈ ఏడాది జూన్ 27న విడుదలైన ఈ మూవీలో కైరా పాత్రలో నటించింది. అన్నా బెన్ తండ్రి స్క్రీన్ రైటర్ బెన్నీ పీ నాయరాంబలం. ఆయన వారసురాలిగా సినిమాల్లోకి వచ్చింది. 2019లో ‘కుంబలంగి నైట్స్’ మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ సినిమాల్లోనూ నటించింది.
ఈ ఏడాది తెలుగుకు పరిచయమైన తారల్లో శ్రుతి మరాఠే. 2003లో స్మాల్ స్క్రిన్‌పై మెరిసిన బ్యూటీ ఆ తర్వాత మరాఠీ చిత్రం సనై చౌఘడే (2008)తో సినీ రంగ ప్రవేశం చేసింది. అనంతరం తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించింది. తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీలో నటించింది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా.. ఎన్టీఆర్ దేవర పాత్రకు భార్యగా చేసింది.
కన్నడ కస్తూరి భూమిశెట్టి ఈ ఏడాది తెలుగులో ‘షరతులు వర్తిస్తాయి’తో తెలుగుకు పరిచయమైంది. 2008లో మొదట టెలీవిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనూ నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెల్లు సీరియల్స్‌లో నటించింది. ఇక 2021లో కన్నడ మూవీ ‘ఇక్కత్’ సినీరంగ ప్రవేశం చేసింది. తెలుగులో తొలిసారిగా ‘షరతులు వర్తిస్తాయి’ మూవీలో నటించింది. ఈ చిత్రంలో చైతన్యరావు హీరోగా నటించారు.
బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ జానీ లివర్ తనయ జామీ లివర్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. లండన్‌లోని మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ విజన్గైన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ఆగస్టు 2012లో కెరీర్‌ను ప్రారంభించింది. 2015లో కిస్ కిస్కో ప్యార్ కరూన్ చిత్రంలో మెరిసింది. ఇక తెలుగులో అల్లరి నరేశ్ హీరోగా తెరకెక్కిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంలో కీలకపాత్రలో నటించింది. జానీ లివర్ స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా. ఆయన బాలీవుడ్ కమెడియన్‌గా రాణిస్తూ ముంబయిలో స్థిరపడ్డారు.