Pawan Kalyan | తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ సినిమాగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఎస్డీ క్యాంపస్ చూస్తుంటే మినీ ఇండియాను చూసినట్టు అనిపించింది. నాకు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ గారు ఎన్ఎస్డీ గురించి తరచుగా చెప్పేవారు. కళలు లేని సమాజంలో హింస ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, కళా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ఎస్డీ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని ఆయన తెలిపారు. యువ కళాకారులకు శిక్షణ ఇచ్చేందుకు, ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి సంస్థలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.