డిజిటల్ మీడియా ప్రాభవంతో సృజనాత్మక హద్దులు తొలగిపోతున్నాయి. వెండితెర మీద రాణిస్తున్న అగ్ర కథానాయికలు సైతం వెబ్‌సిరీస్‌లలో నటించడానికి సిద్ధమవుతున్నారు. బిగ్‌స్క్రీన్ తాలూకు వాణిజ్య సమీకరణాలు వేరు కావడంతో పాత్రలపరంగా వైవిధ్యాన్ని కనబరచడానికి ఆస్కారం తక్కువగా ఉంటోంది. అదే ఓటీటీ వేదికల్లో ప్రయోగాలకు అవకాశం ఉండటం, వినూత్న కథాంశాల్ని ఎంచుకునే వెసులుబాటు లభించడంతో అగ్ర నాయికలు వెబ్‌సిరీస్‌ల బాట పడుతున్నారు. ఇప్పటికే సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా వంటి తారలు వెబ్‌సిరీస్‌లతో సత్తాచాటారు. వారి బాటలో మరికొందరు వాటిపై దృష్టిపెడుతున్నారు.
ప్రేమకథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. ఎనిమిదేళ్ల కెరీర్లో వాణిజ్య ప్రధాన చిత్రాల్లో ఎక్కువగా మెరిసిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లుగా కొత్త దారుల్లో అడుగులు వేస్తోంది. పాత్రల పరంగా తనను తాను నవ్యరీతిలో ఆవిష్కరించుకునే అవకాశాలు సినిమాల్లో అరుదుగా లభిస్తుండటంతో వెబ్‌సిరీస్‌లపై దృష్టిపెట్టింది రాశీఖన్నా. ప్రస్తుతం రెండు సిరీస్‌లలో నటిస్తుంది. ‘ఫ్యామిలీమాన్’ రెండు సీజన్లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రాజ్, డీకే నిర్దేశకత్వంలో షాహిద్‌కపూర్ ప్రధాన పాత్రలో హిందీలో ఓ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. డార్క్ క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందుతున్న ఈ సిరీస్ ద్వారా రాశీఖన్నా వెబ్ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఇందులో ప్రయోగాత్మక పంథాలో ఆమె పాత్ర సాగుతుందని దర్శకద్వయం రాజ్, డీకే చెబుతున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కెరీర్లో తొలిసారి ‘రుద్ర’ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నారు. ఆయన నటించనున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. ఇందులో రాశీఖన్నా కథానాయికగా నటిస్తోంది. వరుస హత్యలకు పాల్పడే సైకో కిల్లర్‌గా వైవిధ్యమైన పాత్రలో ఆమె కనిపించబోతున్నది. భవిష్యత్తులో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రెండింటికి సమప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తానని చెబుతోంది రాశీఖన్నా.
మహిళా ప్రధాన చిత్రాలతో దక్షిణాది చిత్రసీమలో లేడీసూపర్‌స్టార్‌గా గుర్తింపును సొంతం చేసుకున్నది నయనతార. తాజాగా తొలిసారి ఆమె ఓ వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నది. ‘బాహుబలి’కి ప్రీక్వెల్‌గా ‘బాహుబలి బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో ఆర్కా మీడియా సంస్థ, దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఓ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈ సిరీస్‌కు దేవాకట్టా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. మాహిష్మతి సామ్రాజ్య కీర్తిప్రతిష్టల్ని, వైభవాన్ని రాణి శివగామి ఎలా ఇనుమడింపజేసిందనే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో నయనతార ముఖ్యభూమిక పోషిస్తోంది. కథలో తన పాత్రకున్న ప్రాధాన్యత నచ్చడంతో ఆమె ఈ సిరీస్‌ను అంగీకరించినట్లు చెబుతున్నారు. రాహుల్ బోస్, వామిక గబ్బి, అతుల్ కులకర్ణి ఈ సిరీస్‌లో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. తొమ్మిది ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా వెండితెరపై సవాళ్లతో కూడిన పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది చెన్నై సుందరి రెజీనా. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ సొగసరి ‘అన్యాస్ ట్యూటోరియల్’ పేరుతో తెలుగులో మొదటిసారి వెబ్‌సిరీస్ చేయబోతున్నది. హారర్, థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సిరీస్‌లో ఆత్మల కారణంగా ఇబ్బందులు పడే అన్య అనే వెబ్ఛానెల్ అధినేత్రిగా రెజీనా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నది. పల్లవి గంగిరెడ్డి ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవలే విడుదలైన ‘కుడి ఎడమైతే’ సిరీస్‌లో పోలీస్ అధికారి పాత్రలో విలక్షణ అభినయంతో మెప్పించింది అమలాపాల్. ఈ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి అరంగేట్రం చేసిన అమలాపాల్ తొలి అడుగులోనే విజయాన్ని దక్కించుకున్నది. హిందీలో మహేష్‌భట్ దర్శకత్వంలో రూపొందుతున్న సిరీస్‌లో అమలాపాల్ కీలక పాత్రలో నటిస్తోంది. సినీ కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ దర్శకుడికి, అగ్ర తారకు మధ్య సాగే ప్రేమకథతో పీరియాడికల్ లవ్‌స్టోరీగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది.
విలక్షణ చిత్రాల దర్శకుడు మణిరత్నం నిర్మాణంలోరూపొందిన ‘నవరస’ సిరీస్‌తో అగ్రహీరో సూర్య, కథానాయిక అంజలి, అధర్వమురళి సహా పలువురు అగ్ర నాయకానాయికలు వెబ్ ప్లాట్ఫామ్లోకి అరంగేట్రం చేశారు. నవరసాల్ని ఆవిష్కరిస్తూ ఉద్వేగభరితంగా తొమ్మిది ఎపిసోడ్స్‌తో తెరకెక్కిన ఈ సిరీస్ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదలైంది.
గత ఏడాది విడుదలైన ‘కన్నమూచి’ సిరీస్‌తో పూర్ణ తొలిసారి వెబ్మాధ్యమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నది. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ‘నవరస’ సిరీస్‌లో కీలక పాత్రలో నటించింది. వీరితో పాటు పలువురు నాయకానాయికలు వెబ్‌సిరీస్‌లో నటిస్తూ తమ ప్రతిభాపాటవాల్ని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రోడ్డుపై స్నానం చేసి షాకిచ్చిన బాలీవుడ్ నటుడు
కీర్తి సురేష్ ఏంటి హీరోలకు చెల్లెలుగా నటిస్తుంది
చిన్మయిని రేప్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులు
‘మా’లో లొల్లి.. కుర్చీ దిగకూడదని నరేశ్ ప్రయత్నాలు: నటి హేమ
ఆ హీరోయిన్‌కి ఎందుకంత పొగరు అంటూ ట్రోలింగ్