Piracy | తెలుగు చిత్రసీమను పైరసీ ఎంత భయభ్రాంతులకి గురి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పైరసీ మాఫియాలో కీలక పాత్ర పోషిస్తున్న కిరణ్‌కుమార్ ఎట్టకేలకు సైబర్ క్రైమ్ పోలీసులకి చిక్కాడు. ఏపీకి చెందిన ఈ నిందితుడు గతంలో ఏసీ టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. కానీ, ఇప్పుడు అతని పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. వెండితెరపై విడుదలవుతున్న సినిమాలను ఫోనులో రికార్డ్ చేసి, వాటిని టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా పైరసీ స్కామ్ నిర్వహిస్తూ, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు.
సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కిరణ్ ఇప్పటివరకు 65 సినిమాలను పైరసీ చేశాడు. సినిమా విడుదలైన తరువాత వాటిని వెంటనే రికార్డ్ చేసి టెలిగ్రామ్ లో లీక్ చేసేవాడు. ఒక్కో సినిమాకు 300 డాలర్లు చెల్లించి, క్రిప్టో కరెన్సీ రూపంలో కమిషన్లు పొందేవాడు. ఈ విధంగా, నెలకు రూవీ 80,000 వరకు ఆర్జించి, చిత్ర పరిశ్రమకు భారీ నష్టం కలిగించాడు. ఈ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ యాంటీపైరసీ సెల్ ప్రతినిధి మణీంద్రబాబు ఫిర్యాదు చేయడంతో, సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, కిరణ్ ను అరెస్ట్ చేశారు. నిందితుడు 2019 నుండి ఈ క్రియాశీలంగా పైరసీ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఇచ్చిన వివరాల ప్రకారం, గత ఏడాది పైరసీ వల్ల ఇండస్ట్రీకి దాదాపు రూ.3,500 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా . ఈ తరహా కార్యకలాపాలు వందలాది మంది చిత్రనిర్మాతలు, రచయితలు, నటులు, నిర్మాతలు చేసిన కష్టానికి ప్రతికూలంగా మారి, వారి శ్రమను దెబ్బతీయడం జరుగుతుంది. ఈ పైరసీ విషయంలో టాలీవుడ్ ప్రముఖులు, చిత్రనిర్మాతలు, మరియు దర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది అనేక సంవత్సరాల కష్టంతో కోట్లు పెట్టి నిర్మిస్తున్న సినిమాలను పైరసీ చేయడం దారుణం. పైరసీ చేస్తున్న వారికి కఠిన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది అని పలువురు ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.