Tollywood Industry | ఒకవైపు తెలుగు సినిమా రేంజ్ వరల్డ్ వైడ్‌గా పాకుతుంటే మరోవైపు సినిమాలలో అవసరం లేని సన్నీవేశాలతో పాటు హీరోయిన్ డ్యాన్స్‌లు అసభ్యకరంగా ఉన్నాయంటూ తెలంగాణ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. మహిళలను తక్కువ చేసి చూపించే డ్యాన్స్ స్టెప్పులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. తమ ఆదేశాలను పట్టించుకోకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టాలీవుడ్‌కు చెందిన నిర్మాతలతో పాటు దర్శకులను, హీరోలను హెచ్చరించింది. ఇటీవల వచ్చిన రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో పాటు బాలకృష్ణ డాకు మాహారాజ్, నితిన్ రాబిన్ హుడ్ సినిమాలలో డ్యాన్స్ స్టెప్స్ అసభ్యంగా ఉండటంతో పాటు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందాయి.
దీనిపై మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గురువారం స్పందిస్తూ.. సినిమా అనేది సమాజంపై గాఢ ప్రభావం చూపగల ఒక శక్తిమంతమైన సాధనమని అన్నారు. సినిమాల్లో మహిళలను అవమానకరంగా, అశ్లీలంగా చిత్రీకరించే అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు మరియు సంబంధిత ఇతర వర్గాలు బాధ్యతాయుతమైన వైఖరి ప్రదర్శించాలని ఆమె సూచించారు. మహిళలను తక్కువ చేసి చూపే నృత్య రీతులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనట్లయితే తగిన చర్యలు తీసుకోక తప్పదని ఆమె హెచ్చరించారు. సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది నైతిక బాధ్యత. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను, సూచనలను మహిళా కమిషన్‌కు పంపవచ్చు. దీనిపై లోతుగా చర్చించి తగిన చర్యలు చేపడతామని మహిళా కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.