Youtube | పల్లె అనగానే వ్యవసాయం గుర్తొస్తుంది. పాడి పరిశ్రమకు ఆలవాలం అనిపిస్తుంది. కులవృత్తులకు కేరాఫ్‌గా కనిపిస్తుంది. ఏ పల్లెకైనా కాస్త అటూ ఇటూగా ఈ సూత్రం వర్తిస్తుందేమో కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని తుల్సీ గ్రామానికి మాత్రం ఈ ఫార్ములా నప్పదు. ఆ ఊరంతా ఫ్రీ వైఫై జోన్‌ను మరిపిస్తుంది. ఇంటికో యూట్యూబ్ యాక్టర్, వీధికో యూట్యూబర్ కనిపిస్తాడు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు సమీపంలో ఉంటుంది తుల్సీ గ్రామం. సుమారు వెయ్యి గడపలు ఉంటాయి. జనాభా నాలుగు వేల దాకా ఉండొచ్చు. వీరిలో ఓ వెయ్యిమంది వరకు యూట్యూబ్‌కు బలంగా కనెక్టయ్యారు. కొందరు నటులుగా, కొందరు స్క్రిప్ట్ రైటర్లుగా, మరికొందరు వీడియో గ్రాఫర్లుగా ఇలా ఎవరికి వాళ్లు తమ సత్తా చాటడానికి ఉవ్విళ్లూరుతుంటారు. తుల్సీ వేదికగా దాదాపు 40 యూట్యూబ్ చానెళ్లు యాక్టివ్‌గా ఉంటున్నాయి.
పల్లె వాతావరణం, డిఫరెంట్ స్లాంగ్‌లో వాళ్లు పండించే సీరియస్ కామెడీకి వీక్షకులు ఫిదా అవుతున్నారు. కుటుంబ కలహాలు, స్నేహితుల కబుర్లు, గల్లీ రౌడీల బిల్డప్‌లు సబ్జెక్టులుగా యూట్యూబ్ రీల్స్, చిట్టి చిత్రాలు నిర్మిస్తున్నారు. సహజత్వానికి దగ్గరగా ఉండటంతో ఈ వీడియోలకు లెక్కకు మించిన లైక్‌లు వస్తున్నాయి. గ్రామానికి చెందిన ‘ఛత్తీస్‌గఢీ కామెడీ’ యూట్యూబ్ చానెల్‌కు దాదాపు లక్షన్నరమంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ఈ చానెల్లో 250కి పైగా వీడియోలు అప్లోడ్ చేశారు. అన్నీ సూపర్ వ్యూస్ సాధించినవే! వీరిలో కొందరు యూట్యూబర్లు నెలకు రూ.20వేల నుంచి రూ.40వేల వరకు సంపాదిస్తుండటం విశేషం. మొత్తంగా ఊరంతా యూట్యూబ్‌కు వంత పాడుతుండటం వింతేగా!