తెలుగు సినిమాల్లో ఒకప్పుడు.. కథానాయకుడు విశాఖ ఎక్స్‌ప్రెస్ దిగేవాడు! కథానాయిక గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కేది!! తెలంగాణ ఆగయీ.. ఇండస్ట్రీ సోఁచ్ బదల్గయీ.. ఇప్పుడు తెలుగు హీరో జోగిపేట నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాడు. హైదరాబాద్‌లో బస్సెక్కి మెదక్‌లో దిగుతున్నాడు. దశాబ్దాలుగా తెలుగు సినిమాల్లో విస్మరణకు గురైన తెలంగాణ యాస, ప్రాంతాలకు పనిగట్టుకొని ప్రాధాన్యంఇస్తున్నారు సినీజనాలు. ఒకప్పుడు కమెడియన్‌కు, క్రూరమైన విలన్‌కు పరిమితం చేసిన తెలంగాణయాస.. ఇప్పుడు హీరోల భాష. హీరోయిన్ల భాష. మాటలో తెలంగాణం.. పాటలో తెలంగాణం.. కథా వస్తువులో, కథనంలో, లొకేషన్లలో ఇలా వెండితెరపై తెలంగాణ పరిఢవిల్లుతున్నది.

‘గుడివాడ ఎళ్లాను.. గుంటూరు పోయాను..’
తెలుగు రాష్ర్టాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు గతంలో ఎన్నడో వచ్చిన పాట. చివరి పంక్తిలో ఏదో మొహమాటంగా ‘వరంగల్లు’ అనేసి ఊరుకున్నారు. నాటి సినీకవులకు ‘రైక చూస్తే.. రాజమండ్రి.. పైట చూస్తే పాలకొల్లు..’ గుర్తొచ్చాయి కానీ, ఇందూరు, అందోలు ఎందుకు యాదికి రాలేదో అర్థం కాదు. అంతెందుకు ‘అ.. అంటే అమలాపురం’… అంటూ ‘టక్కుటమారం బండి..’ ఎక్కి ఉమ్మడి రాష్ట్రంలో ఊర్ల పేర్లు ఏకరువు పెట్టారు. జనగామ హంగామ మినహాయిస్తే.. అన్నీ అటువైపు పేర్లే!
పాటల సంగతి పక్కనపెట్టి.. మాటలకొద్దాం…
‘ఎన్టీవోడంటే ఏమన్కున్నవ్ బై… దునియాల గసొంటి యాక్టర్ లేడన్నట్టు.. కానీ, ఏం చేస్తం! భీముడేశం కట్టిండు కదా!..’ అని పేరుమోసిన దర్శకబ్రహ్మలు సైతం తెలంగాణ యాసను కామెడీ ట్రాక్‌కు పరిమితం చేశారు. అభ్యుదయ దర్శకులం అని చెప్పుకొన్న వాళ్లూ.. ‘ఎవ్వడు పడ్తడయ్యా గీ పరేషాన్లన్నీ..’ అని విలన్ పాత్రలతో డైలాగులు చెప్పించి తెలంగాణ అస్తిత్వాన్ని క్రూరంగా చూపించే ప్రయత్నం చేశారు. నిన్న మొన్నటి వరకు పాతబస్తీ యాక్సెంట్‌ను విలన్ బ్యాచ్‌లో తొట్టిగ్యాంగుతో పలికించి దక్కనీ పరిమళాన్ని కంపుకొట్టిచ్చారు.
తెలంగాణ వచ్చింది.. టాలీవుడ్ పంథా మార్చుకుంది. మన భాషను గౌరవించడం నేర్చుకుంది. మన యాసకు పట్టం కట్టడం షురూ చేసింది. ఇప్పుడు హీరో పాత్ర అనర్గళంగా మన భాషలో మాట్లాడుతున్నది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రం తెలంగాణ గ్రామీణ సౌందర్యాన్ని, యాసలోని మాధుర్యాన్ని, మాండలికంలోని
సొగసును అద్భుతంగా వెండితెర దృశ్యమానం చేసింది. పూర్తి తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ప్రధాన స్రవంతి ప్రేమకథా చిత్రంగా భారీ విజయాన్ని సాధించింది. ఇక సోలో సాంగుల్లోనూ తెలంగాణ స్లాంగు వినిపిస్తున్నది. ‘టిల్లు’ లొల్లి ఎట్లుంది. ‘అట్లుంటది మనతోని..’ అని పెద్దహీరోలు కూడా రీల్స్ పెట్టుకుంటున్నరు. ‘జనం కోరేది మనం శాయడమా…’ అని నేపాళ మాంత్రికుడు అన్నట్టు.. ప్రేక్షకుల అభిరుచి మేరకు స్టార్ హీరోలూ తెలంగాణ యాసకు కట్టుబడ్డారు. మన మాటల్లో పరిమళాన్ని ఇన్నాళ్లకు అర్థం చేసుకోగలిగారు.
తెలంగాణ ఏర్పాటుతో మాటపాటల్లో మాత్రమే కాదు.. సాంకేతిక వర్గం నుంచి నటీనటుల వరకు తెలంగాణకు సముచిత పాత్ర దక్కుతున్నది. కథల్లో తెలంగాణ నేపథ్యం ప్రతిఫలిస్తున్నది. లొకేషన్లలో మన ప్రాంతాలు కొత్తగా కనువిందు చేస్తున్నాయి. అలా తెలంగాణ చుట్టూ అల్లుకున్న కథలు చక్కటి విజయాలు సాధిస్తున్నాయి. కేవలం వెండితెర మీదనే కాకుండా ఓటీటీ, డిజిటల్ మీడియాలో కూడా తెలంగాణ నటీనటులు, సాంకేతిక నిపుణులు చక్కటి ప్రతిభను కనబరుస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోలు ఇండస్ట్రీలో ఇప్పుడు బలంగా స్థిరపడుతున్నారు.

Jathi Ratnalu
విజయ్ నుంచి ఆనంద్ వరకు
‘పెళ్లిచూపులు’తో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో విజయ్ దేవరకొండ. మొదటి సినిమాలో ఫక్తు తెలంగాణ యాసతో ఇరగదీశాడు. ఇందులోని పాత్రలన్నీ దాదాపు మన యాసనే పలికాయి. సినిమా హిట్టు. ‘అర్జున్‌రెడ్డి’ మళ్లీ మన యాస. మళ్లీ విజయం. మొత్తంగా విజయ్ దేవరకొండ టాలీవుడ్లో తెలంగాణ గొంతుగా స్థిరపడ్డాడు. విజయ్ తర్వాత విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ వంటి హీరోలు వెండితెరపై తమదైన తెలంగాణ యాసతో ఆకట్టుకున్నారు. సిద్ధు జొన్నలగడ్డ నిన్నటికి నిన్న ‘టిల్లు స్కేర్’గా మరోసారి హిట్టుకొట్టాడు.
ఒకరేమిటి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, జబర్దస్త్ వేణు వీళ్లంతా తెలంగాణ ఒడిలో పెరిగిన బిడ్డలే! ప్రియదర్శి, వేణు కలిసి పండించిన ‘బలగం’ తెలంగాణ పల్లె గొప్పదనాన్ని పదికాలాలూ నిలిచేలా చేసింది. మన ప్రాంతంలో బంధాలు ఎంత బలంగా ఉంటాయో నిరూపించింది. అంతకుముందు ప్రియదర్శి నటించిన బయోపిక్ ‘మల్లేశం’ మరో సంచలనం. ఆసు యంత్రాన్ని కనిపెట్టిన పోచంపల్లి నేతన్న మల్లేశాన్ని స్టార్ హీరోను చేసింది. ఇక సింగరేణి నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘దసరా’ చిత్రం వందకోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సత్తాచాటింది. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా వరుస విజయాలు సాధిస్తూ టాలీవుడ్లో తెలంగాణ హీరోల పాత్ర పెంచాడు.
దర్శకులకూ బ్రహ్మరథం
తెలంగాణ వచ్చాక మన హీరోలకే కాదు, దర్శకులకూ ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణ మట్టిలో పుట్టి మాణిక్యాలుగా వెలుగొందుతున్నారు. తరుణ్‌భాస్కర్ ‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడాకోలా’ చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ వేణు కాస్తా.. ‘బలగం’ వేణుగా స్థిరపడ్డాడు.
‘నీదినాది ఒకే కథ’, ‘విరాటపర్వం’ చిత్రాలతో వేణు ఊడుగుల వెండితెరపై తనదైన ముద్రను వేశాడు. ‘జాతిరత్నాలు’తో అనుదీప్ కిరాక్ దర్శకుడు అనిపించుకున్నాడు. ‘అర్జున్‌రెడ్డి’తో అదరగొట్టిన సందీప్ వంగా ‘యానిమల్’తో పాన్ ఇండియా దర్శకుడిగా స్థిరపడ్డాడు.

‘దసరా’ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల కమర్షియల్
డైరెక్టర్‌గా సత్తా చాటాడు. ఇలా పదుల సంఖ్యలో తెలంగాణకు చెందిన దర్శకులు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఒకటేమిటి.. దశాబ్ది తెలంగాణలో ఊహించని మార్పులు ఎన్నో చోటు చేసుకున్నాయి. గడిచిన పదేండ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించింది. వెండితెరపైనా అదే రేంజ్లో తెలంగాణం బంగారం అనిపించుకుంటున్నది.