Pushpa 2 | హైదరాబాద్, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల అవుతున్న ‘పుష్ప-2’ చిత్రం మన రాష్ట్రంలో మాత్రం ఒకరోజు ముందే సందడి చేయనున్నది. 4న పలు థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్రదర్శించనున్నారు. మరోవైపు ‘పుష్ప-2’ బెనిఫిట్ షో టికెట్ ధరపై అదనంగా రూ.800 పెంచుకునేందుకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9:30, అర్ధరాత్రి ఒంటిగంట షోకు రూ.800 పెంపు వర్తించనున్నది. దీంతో జీఎస్టీ అన్నీ కలుపుకొని సింగిల్ స్రీన్స్ టికెట్ ధర రూ.1121కాగా, మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.1239గా నిర్ణయించారు.
మొదటి నాలుగు రోజులపాటు సింగిల్ స్రీన్స్ టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్స్ టికెట్ ధరపై రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇక, డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లపై రూ.105, మల్టీప్లెక్స్‌లో రూ.150, డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్ టికెట్‌పై రూ.20, మల్టీప్లెక్స్ టికెట్‌పై అదనంగా రూ.50 ధర పెంచేందుకు హోంశాఖ ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత సాధారణ రేట్లు ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇదిలా ఉండగా ‘పుష్ప-2’ చిత్రం ఆరు భాషల్లో 12 వేలకి పైగా స్క్రీన్లలో విడుదలకానున్నది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.