Gaddar Awards | ప్రతి ఏడాది ఉత్తమ ప్రతిభ కనపరిచిన చిత్రానికి, సినీ కళాకారులకూ ఇకపై ‘గద్దర్’ పేరిట అవార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగా కార్యాచరణ మొదలైంది. తెలంగాణ ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదనల మేరకు గద్దర్ అవార్డులకు సంబంధించిన విధివిధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో ఓ ప్రత్యేక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి, గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక కమిటీ వివరాల్లోకెళ్తే.. సామాజిక చిత్రాల దర్శకుడు, నిర్మాత బి.నరసింగరావుని ‘గద్దర్ అవార్డుల’ కమిటీ అధ్యక్షుడిగా నియమించగా, అగ్ర నిర్మాత దిల్‌రాజుని ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అలాగే కమిటీ సలహాదారులుగా దర్శకులు కె.రాఘవేంద్రరావు, ఆర్.నారాయణమూర్తి, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్‌శంకర్, నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు, గీత రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌లతోపాటు బలగం వేణుని నియమించారు.
ఇదిలావుంటే.. ‘గద్దర్’ పేరిట అవార్డులు ఇస్తామని తాము ప్రకటించినా చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రాలేదని కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై అగ్ర నటుడు చిరంజీవి తన ఎక్స్ ద్వారా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్లాలని చిత్ర పరిశ్రమకు ఆయన విజ్ఞప్తి చేశారు.
దాంతో ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ విషయంపై దృష్టి సారించింది. ‘గద్దర్ అవార్డుల’పై తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ)తో చర్చించి, నియమనిబంధనలు, విధివిధానాలను రూపొందించి, ఎఫ్డీసీ ద్వారా ప్రభుత్వానికి అందించారు. ఈ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ప్రకటించింది.