OG Ticket Rates | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక షోలు, టికెట్ ధరల పెంపు కూడా కలెక్షన్స్ పెరగడానికి తోడ్పడింది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకి గట్టి షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ‘ఓజీ’ కి టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.
మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో పెరిగిన ధరలకు టికెట్లు విక్రయించడానికి జీఓ కూడా జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100/-, మల్టీప్లెక్స్‌లలో రూ.150/- మేర టికెట్ రేట్లు పెంచేందుకు తెలంగాణ సర్కార్ అనుమతినిచ్చింది.కానీ ఈ నిర్ణయంపై బర్ల మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ ధరల పెంపు సామాన్య ప్రేక్షకులపై భారం మోపుతోందని, అది అన్యాయం అని వాదించారు.ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తాజాగా టికెట్ ధరల పెంపుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీనిని అనుసరించి రాష్ట్ర పోలీస్ శాఖ సోమవారం మరో జీఓ విడుదల చేస్తూ, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆదేశించింది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఇకపై కేవలం సాధారణ రేట్లకే టికెట్లు అమ్మాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సామాన్య ప్రేక్షకులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరలు తగ్గడంతో మరింత మంది ప్రేక్షకులు థియేటర్లకు రావచ్చని, ఇది చివరికి సినిమాకే లాభమవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా, బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘ఓజీ’ కి టికెట్ రేట్ల తగ్గింపు కొత్త మలుపు తీసుకువచ్చింది.