Balagam | తెలంగాణ సంస్కృతి, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కడంతోపాటు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా `బలగం` పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నది. తాజాగా మరో అవార్డు కోసం పోటీ పడుతోంది. ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివల్లో హాలీవుడ్ సినిమాలతో `సై` అంటున్నది. `బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఫీచర్` క్యాటగిరీలో `బలగం` సినిమా నామినేట్ అయిందని ఆ చిత్ర బృందం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై వెల్లడించింది.
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో `అవతార్: ది వే ఆఫ్ వాటర్, టాప్ గన్: మావెరిక్ సినిమాలతోపాటు బలగం పోటీ పడటం పట్ల చిత్ర నిర్మాణ సంస్థ `దిల్‌రాజు ప్రొడక్షన్స్` హర్షం వ్యక్తం చేసింది. ఈ ఫెస్టివల్లో 82 దేశాలకు చెందిన 1074 సినిమాలు పలు విభాగాల్లో పోటీ పడుతున్నాయి. వచ్చేనెల 14న జరిగే వేడుకల్లో నిర్వాహకులు విజేతలను ప్రకటిస్తారు. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని వేణు యెల్దండి తెరకెక్కించారు.