‘హుషారు’ చిత్రంతో యువతరంలో మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు హీరో తేజస్ కంచర్ల. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’ నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాలభాను నిర్మించారు. ఈ సందర్భంగా హీరో తేజస్ కంచర్ల శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ ‘తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో నడిచే కథ ఇది. నేను పుట్టిపెరిగింది హైదరాబాద్లో కాబట్టి యాస విషయంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు.
దర్శకుడు వివేక్ రెడ్డి కథ చెప్పగానే చాలా ఎక్సైట్ అయ్యాను. ఊరిలో జులాయిగా తిరిగే హీరో పట్నం నుంచి వచ్చిన అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే సినిమా కథ. ఈ కథలో ఆద్యంతం నవ్వించే కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి’ అన్నారు. లాక్డౌన్ సమయంలో మూఢనమ్మకాల గురించి ఎక్కువగా వార్తలు చదివానని, అలాంటి కొన్ని సంఘటనల చుట్టూ అల్లుకున్న కథ ఇదని తేజస్ కంచర్ల తెలిపారు.