TiruMala Darshan | యువ కథానాయకుడు తేజ సజ్జా గురువారం ఉదయం కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తేజ సజ్జా, ఆయన నటించిన ‘మిరాయి’ చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేనిలకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు ఘన స్వాగతం పలికి, వారికి దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తేజ సజ్జా నటించిన తాజా చిత్రం ‘మిరాయి’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.