Teja Sajja |యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రేట్లు పెంచకుండానే, ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.27.20 కోట్లు, రెండో రోజు రూ.28.40 కోట్లు వసూలు చేసి, రెండు రోజుల్లోనే రూ.55.60 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లింది. స్టార్ హీరోలు సాధించలేని రేంజ్లో ఓ యంగ్ హీరో సినిమా ఇలాంటి కలెక్షన్స్ సాధించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక తేజ సజ్జా ‘హనుమాన్’తో పాన్ ఇండియా రేంజ్‌ను టచ్ చేసి, రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ‘మిరాయ్’తో ఆ రికార్డుల్ని తిరగరాయాలని భావిస్తున్నాడు. ఓవర్సీస్లోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్లో చేరింది. అక్కడ థియేటర్ల సంఖ్య కూడా పెంచుతున్నారు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ వీకెండ్ ముగిసేలోపు $1.5 మిలియన్ మార్క్ దాటే ఛాన్స్ ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను సాధారణ ధరలకే అమ్మిన నిర్మాతలు, నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ.20 కోట్లకు పైగా లాభాలు ఆర్జించారు. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ టెన్షన్ పడాల్సిన పరిస్థితి లేదు. ఏపి, తెలంగాణలో సోమ, మంగళవారాల్లోనే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
రెండు వరుస బ్లాక్బస్టర్లతో (హనుమాన్, మిరాయ్) తేజ సజ్జా క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెట్టాడు. ‘జాంబీ రెడ్డి 2’ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తేజ, ‘మిరాయ్ 2’ కూడా చేయనున్నాడు. ఈ మూవీ స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయి ఈ రెండు పూర్తైన తర్వాత ‘జై హనుమాన్’ అనే భారీ ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు సమాచారం. లవ్ స్టోరీలు, రొమాంటిక్ డ్రామాల్ని పక్కనబెట్టి, తేజ ఫాంటసీ, అడ్వెంచర్, డివోషనల్ థీమ్‌లపై దృష్టి పెట్టడం ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త హీరోగా తన మార్క్‌ను ప్రూవ్ చేసుకున్న తేజ సజ్జా, ఇప్పుడు స్టార్ స్టేటస్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాడు.