నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శనివారం రష్మిక పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఈ సినిమాకు చెందిన పోస్టర్ని, ‘రేయి లోలోతులా..’ అంటూ సాగే టీజర్ సాంగ్‌ని విడుదల చేశారు. నడుముకి వేళ్లాడుతున్న గన్, చేతులో కత్తి.. మొత్తంగా ఓ వారియర్‌లా రష్మిక ఈ పోస్టర్లో కనిపిస్తున్నది. ఇక ‘రేయి లోలోతులా..’ పాట విషయానికొస్తే.. రాకేం దుమౌళి రాయగా, హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరచి, చిన్మయితో కలిసి ఆలపించారు. అగ్ర హీరో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ఈ పాట మొదలవ్వడం విశేషం. ‘రేయి లోలోతుల సితార.. జాబిలి జాతర.. కన్నులలో వెన్నెలలే కురిసే.. మదిమోసే తలవాకిట తడిసే.. యద జారెనే మనసు ఊగెనే.. చెలి చెంత లో జగమాగెనే.. యద జారనే మనసా..’ అంటూ ఫీల్‌గుడ్‌గా ఈ పాట సాగింది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: కృష్ణన్ వసంత్, నిర్మాణం: గీతా ఆర్ట్స్, మాస్మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్.