Tamil Stars| సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ క్రేజ్ పెరిగిందంటే వారి ఇమేజ్ తగ్గట్టు ఏదో ఒక ట్యాగ్ తగిలించేస్తుంటారు. థియేటర్స్ లో స్క్రీన్ మీద ట్యాగ్ పడిందంటే ఇక అభిమానుల గోల అంతా ఇంతా కాదు. ఒకప్పుడు హీరోలకి మాత్రమే ట్యాగులు ఉండేవి. కాని ఇప్పుడు అలా కాదు హీరోయిన్స్, దర్శకులకి కూడా ట్యాగులు ఇచ్చేస్తున్నారు. మన టాలీవుడ్లో చూస్తే హీరోలకి మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్, గ్లోబర్ స్టార్, ఐకాన్ స్టార్, నేచురల్ స్టార్ అబ్బో ఇలా ఎన్నో ట్యాగులు ఇచ్చేశారు. ఇక బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఏ ఇండస్ట్రీ అయిన సరే హీరో, హీరోయిన్స్ పేరు ముందు ట్యాగ్ తప్పనిసరి అయింది.
అయితే స్టార్స్ తమ పేర్ల కంటే వారి ట్యాగ్స్తోనే అభిమానుల మదిలో నిలిచిపోతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాకపోతే ఈ మధ్య కొందరు స్టార్స్ ఈ ట్యాగ్‌లని పక్కన పెట్టమని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చాక పవర్ స్టార్ అని తనని పిలవొద్దని పదే పదే వేడుకోవడం మనం చూశాం. ఇక తమిళనాట అయితే బిరుదులు, స్పెషల్ ట్యాగ్స్ ఏమి వద్దంటూ స్టార్స్ బాయ్ కాట్ చేస్తున్నారు. మా పేరుతోనే పిలవాలని ప్రత్యేక బిరుదులు మాకు వద్దని వేడుకుంటున్నారు. రీసెంట్గా నయనతార తన పేరు ముందు లేడి సూపర్ స్టార్ ట్యాగ్ తగిలించవద్దని కోరింది.
‘జవాన్’ సినిమాతో బాలీవుడ్లో కూడా తన సత్తాని చూపించిన నయన్‌ని ఉత్తరాది వారు సైతం ‘లేడీ సూపర్ స్టార్’ అనడం చేస్తున్నారట. దీంతో నయనతార నా పేరు ముందు అలాంటివి ఏవి పెట్టొద్దంటూ ఓపెన్ లెటర్ రిలీజ్ చేసింది. తనని నయనతార అని పిలవడమే సంతోషంగా ఉంటుందని తెలియజేసింది. అంతకు ముందు తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ సైతం ఇదే రిక్వెస్ట్ చేశాడు. సాధారణంగా కమల్ని ‘ఉలగనాయగన్’ , లోకనాయుడు, విశ్వనటుడు అంటూ సంబోధిస్తారు. తనను ఎవరూ అల పిలవకూడదని కమల్ రిక్వెస్ట్ చేశారు. తమిళ స్టార్ హీరో అజిత్ కూడా తన పేరుకు ముందు ‘తల అని కాదల్ మన్నన్’ అని యాడ్ చేయోద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇలా తమిళ్ స్టార్స్ ఒక్కొక్కరు బిరుదులను బాయ్ కాట్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.