Tamil Actors | సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తారలకు తమిళ జనం అగ్రతాంబూలం అందిస్తారు. చిత్రసీమలో ఓ వెలుగు వెలిగి రాజకీయ అరగేట్రం చేసిన పలువురు నటీనటులు తమిళ రాజకీల్లోనూ సత్తా చాటారు. సినిమాల్లో తారలై మెరిసిన ఎందరో నటులు రాజకీయాల్లో నేతలుగానూ ఆదరణ పొందుతున్నారు. తమిళ రాజకీయాల్లో సినీ గ్లామర్ కొనసాగుతున్నది. అగ్ర నటుడు జోసెఫ్ విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ (తమిళనాడు విక్టరీ పార్టీ) పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించడం ద్వారా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. తామంతా దళపతి అని పిలుచుకునే విజయ్ ఇప్పుడు రాజకీయారంగేట్రం చేస్తుండటంతో అభిమానుల్లో ఆనందం నింగినం టుతున్నది. రాజకీయాలు మరో వృత్తి కాదని పవిత్ర ప్రజా సేవ అని పేర్కొన్న విజయ్ తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, దక్షిణాది నటులు రాజకీయ రంగ ప్రవేశం చేయడం కొత్తేమీ కాదు. వాస్తవానికి తమిళ రాజకీయాల్లోని ప్రస్తుత ప్రముఖులంతా సినీ తారలేనని చెప్పుకోవాలి.

ఎంజీఆర్ : ఎంజీఆర్‌గా సుపరిచితుడైన మారుతుర్ గోపాలన్ రామచంద్రన్ సినీ నేపథ్యం నుంచి వచ్చి తమిళ రాజకీయాలను శాసించారు. 1977 జూన్ నుంచి 1987 డిసెంబర్లో మరణించే వరకు ఎంజీఆర్ మూడు పర్యాయాలు తమిళనాడు రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఎంజీఆర్ ‘ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే)ను స్థాపించారు. అయితే, 1972లో ‘ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)తో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అంతకు ముందు ఎంజీఆర్ నాలుగు దశాబ్దాల పాటు నటుడిగా చలనచిత్ర రంగాన్ని ఏలా రు. 1936లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన పరిశ్రమ ప్రముఖుల్లో ఒకరిగా ఎదిగి 1987 వరకు నటుడిగా కొనసాగారు.
జయలలిత : తమిళ రాజకీయాలను శాసించిన మరో సినీ తార జయలలిత. ఈమె పూర్తి పేరు జయరామ్ జయలలిత. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆరు పర్యాయాలు పనిచేశారామె. 1960లో బాలనటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించి 1965లో ప్రధాన పాత్రలో తొలిసారి నటించారు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 650 చిత్రాల్లో నటించారు. 1982లో తన అత్యంత విజయవంతమైన కోస్టార్ ఎంజీఆర్‌తో కలిసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అన్నాడీఎంకేలో చేరి, ఎంజీఆర్ మరణానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు.
కెప్టెన్ విజయ్‌కాంత్: కెప్టెన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్‌కాంత్ కూడా తమిళ నటుడు, రాజకీయ నాయకుడే. ఈయన అసలు పేరు విజయ్‌రాజ్ అళగర్ స్వామి. దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) వ్యవస్థాపించారు. తమిళనాడులో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1979లో ‘ఇనిక్కుం ఇలామై’ సినిమాతో అరగేట్రం చేశారు. నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో వందలాది సినిమాల్లో నటించారు.
నెపోలియన్: నెపోలియన్.. ఇది ఆయన రంగస్థల పేరు. ఆ పేరుతో సుపరిచితుడైన కుమరేశన్ దురైసామి.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ భాషా సినిమాల్లో నటించారు. 1991లో సినీరంగ ప్రవేశం చేసిన నెపోలియన్ 2019లో తన మొదటి హాలీవుడ్ చిత్రం ‘డెవిల్స్
నైట్: డాన్ ఆఫ్ ది నైస్ రూజ్’లో నటించారు. డీఎంకే ద్వారా రాజకీయాల్లో చేరిన ఆయన 2009 నుంచి 2013 మధ్య మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం-సాధికారత శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. తర్వాత డీఎంకేను వీడి 2015లో బీజేపీలో చేరారు.
కమల్‌హాసన్: కమల్‌హాసన్‌గా సుపరిచితుడైన పార్థసారథి శ్రీనివాస్ 2018లో ‘మక్కల్ నీది మయ్యమ్’ (ఎంఎన్ఎం) అనే పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళనాడుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడి కుమారుడైన కమల్‌హాసన్ 1960లో ఆరేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ‘ఉలగనాయగన్’ అని కూడా పిలువబడే కమల్‌హాసన్ ఆరు దశాబ్దాల కెరీర్లో వివిధ భాషల్లో ఇప్పటివరకు 230కి పైగా చిత్రాల్లో నటించారు.