The Kerala Story | వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ విడుదలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమిళనాడులోని థియేటర్ల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. చిత్రాన్ని ప్రదర్శించకూడదని నిర్ణయించాయి. ఆన్లైన్ టికెట్ బుకింగ్ నుంచి తొలగించాయి. రాష్ట్రంలో 13 థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు. మల్టీపెక్స్‌లో ది కేరళ స్టోరీ సినిమా ప్రదర్శించడంతో ఇతర చిత్రాలపై ప్రభావం పడుతుందని థియేటర్ల యాజమానులు పేర్కొంటున్నారు.
శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే కారణంతో చిత్రాన్ని ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు మల్టీప్లెక్స్ అసోసియేషన్ పేర్కొంది. మల్టీప్లెక్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తే.. ఇతర సినిమాలకు సైతం ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని, అలాగే తమ ఆదాయాన్ని సైతం ప్రభావిస్తుం చేస్తుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు ఒకరు తెలిపారు. ‘ది కేరళ స్టోరీ’పై నిషేధం విధించాలని కొద్దిరోజులుగా తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఈ ప్రకటన చేసింది. షెడ్యూల్ చేసిన షోలను సైతం రద్దు చేశారు. ప్రదర్శనలు కొనసాగిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లను ముట్టిస్తామని తమిళ పార్టీలతో పాటు ముస్లిం సంఘాలు హెచ్చరించాయి. సినిమా విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) చెన్నైలో నిరసనలు సైతం దిగింది.
ఈ చిత్రానికి వ్యతిరేకంగా చెన్నైలోని స్కైవాక్ మాల్ సమీపంలోని అన్నానగర్ ఆర్చ్‌లో ‘నామ్ తమిళర్ కట్చి’ పార్టీ నేత, నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని కార్యకర్తలు నిరసనలకు దిగారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినిమాను ప్రదర్శించొద్దని యజమానులకు విజ్ఞప్తి చేయడంతో పాటు చూడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘కేరళలో 32వేల మంది హిందూ, క్రిస్టియన్ మహిళలను మతం మార్చారని, వారిని బలవంతంగా ఐసిస్ ఉగ్రవాదులుగా మార్చిన కథ’ అని పేర్కొనగా.. తర్వాత కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతుల యదార్థ కథగా మార్చారు.