తమిళనాట ఓ భారీ మల్టీస్టారర్‌కి రంగం సిద్ధమైంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం శంకర్ దర్శకత్వంలో ఈ పాన్ఇండియా సినిమా తెరకెక్కనున్నది. ఇందులో విక్రమ్, సూర్య కలిసి నటిస్తారట. వీరిద్దరూ 21ఏండ్ల క్రితం ‘పితామగన్’ చిత్రంలో కలిసి నటించారు. బాలా దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. తెలుగులో ‘శివపుత్రుడు’గా విడుదలై ఇక్కడా అఖండ విజయాన్ని చవిచూసింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత విక్రమ్, సూర్య తెరను పంచుకోబోతున్నారనే వార్త వారి అభిమానుల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తున్నది.
తమిళనాట ప్రాచుర్యం పొందిన ‘వేల్పారి’ అనే నవల ఆధారంగా శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. మూడు భాగాలుగా ఈ సినిమా రానున్నదని తమిళ వర్గాలు కోడై కూస్తున్నాయి. వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌తో మూడు భాగాలూ ఒకేసారి షూట్ చేసి, రెండు నెలల వ్యవధితో విడుదల చేయాలన్నది శంకర్ ప్లాన్ అట. అయితే.. ఇంత పెద్ద ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే ముందు శంకర్‌కి అర్జంట్‌గా హిట్ అవసరం. రామ్‌చరణ్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘గేమ్‌చేంజర్’ డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ సినిమా హిట్ అయితే, సూర్య, విక్రమ్‌ల సినిమాకు మార్గం సుగమం అయినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.