Rudramadevi | ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత గుర్తుండిపోయే పాత్రలలో ఒకటి గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘రుద్రమదేవి’ చిత్రంలోని గోన గన్నారెడ్డి పాత్ర. ఈ పాత్రకు అల్లు అర్జున్ ప్రాణం పోసి, సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే, ఈ పాత్రకు అల్లు అర్జున్ మొదటి ఛాయిస్ కాదని, ప్రముఖ నటుడు విక్రమ్ ప్రభు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాజాగా అనుష్క శెట్టితో కలిసి నటించిన ‘ఘాటి’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోన్న విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. ఈ విషయాన్ని బయటపెట్టారు. గుణశేఖర్ మొదట గోన గన్నారెడ్డి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో నేను ఆ సినిమా చేయలేకపోయాను. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు ఆ పాత్రను పోషించారు. ఆయన ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడమే కాకుండా, ఒక ఐకానిక్ పాత్రగా మార్చేశారు. ఈ విషయంలో అల్లు అర్జున్‌ని చాలా అభినందించాలి అని విక్రమ్ ప్రభు పేర్కొన్నారు. అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో చూపించిన అద్భుతమైన నటన, ఆయన డైలాగ్ డెలివరీ, మరియు యాటిట్యూడ్ ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి. ఈ పాత్ర కారణంగా ‘రుద్రమదేవి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. విక్రమ్ ప్రభు వెల్లడించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.