Tamannaah Bhatia | మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో నటించిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘ఓదెల 2’ (Odela 2). ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రస్తుతం ఈ సినిమా అందుబాటులో ఉంది. ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్గా దర్శకుడు అశోక్ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మరో దర్శకుడు సంపత్ నంది కథ అందిచారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఊళ్లో ఆడవాళ్ల ఉసురు పోసుకుంటున్నాడన్న విషయం తెలిసి, భర్త తిరుపతి(వశిష్ట ఎన్.సింహా)ని భార్య రాధ(హెబ్బాపటేల్) నరికి చంపి అతని తలతోపాటు పోలీస్టేషన్కి వెళ్లి లొంగిపోవడంతో ‘ఓదెల రైల్వేస్టేషన్’ కథ ముగిసింది. రాధ జైలుకు వెళ్లింది. తిరుపతి శవానికి పోస్ట్మార్టం పూర్తయింది. బాడీని ఇంట్లోవారికి అందజేశారు. తిరుపతి శవాన్ని ఊళ్లోకి తీసుకొచ్చారు. ఊళ్లోజనం ఉసురు పోసుకున్నాడన్న కసితో ఊళ్లోవారెవరూ తిరుపతి శవాన్ని చూడ్డానికి కూడా రాలేదు. సరికదా.. అతని ఆత్మని కూడా శిక్షించాలని నిర్ణయించుకుంటారు. ఊరి పూజారి సలహా మేరకు అతని శవాన్ని నిలువనా నిలబెట్టి, అతని శరీరాన్ని కోడి నెత్తురుతో తడిపి, ఊళ్లో జనం గోళ్లు మూటగట్టి.. ఆ మూటతో సహా అతన్ని పాతిపెడతారు. అలా నిలువునా పాతిపెడితే అతని ఆత్మకు శాంతి క్షోభకు గురి అవుతుందని వారి నమ్మకం. ఊరి జనం చేసిన పనివల్ల తిరుపతి ఆత్మ నిజంగానే క్షోభ చెందుతుంది. ఆ బాధ కాస్తా పగగా మారుతుంది. తను దెయ్యంగా మారతాడు. ఊర్లో కొత్తగా పెళ్లయిన జంటల్నీ టార్గెట్ చేసి, భయంకరంగా చంపతుంటాడు. వేరేవాళ్ల శరీరాల్లోకి ప్రవేశించి వారి ద్వారా తన కార్యాన్ని పూర్తి చేస్తుంటాడు. ఈ చర్యలవల్ల అమాయకులు బలైపోతుంటారు. అలాంటి సమయంలో తరుణోపాయం కోసం ఊరిజనం జైల్లో ఉన్న రాధను కలుస్తారు. ‘వాడ్ని చంపింది నువ్వే. ఇప్పుడు కాపాడాల్సింది నువ్వే’ అని ప్రాధేయపడటంతో రాధ తన అక్క భైరవి(తమన్నా) గురించి ఊరు జనాలకు చెబుతుంది. ఈ దెయ్యం ఆటకట్టించే శక్తి భైరవికి మాత్రమే ఉందని రాధ ఊరి జనాలకు చెప్పడంతో ఊరిజనం భైరవిని వెతికే ప్రయత్నాలు మొదలుపెడతారు. తన జీవితాన్ని శివుడికే అంకితం చేసిన నాగసాధు భైరవి. మరి భైరవిని ఊరుజనం ఎలా చేరారు? ఊరికి పట్టిన పీడను భైరవి ఎలా వదిలించింది? ఈ క్రమంలో క్షుద్రశక్తితో భైరవి చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ.