Tamannaah | దివ్యభారతి.. 90 దశకంలో యువతరం కలలరాణి. కేవలం ఆమె కోసమే సినిమాలు ఆడిన సందర్భాలున్నాయి. తెలుగులో ఆమె చేసిన బొబ్బిలిరాజా, అసెంబ్లీరౌడీ, రౌడీ అల్లుడు, ధర్మక్షేత్రం సినిమాలు తేలిగ్గా మరిచిపోగలమా? అజంతా శిల్పం లాంటి అందంతో నాటి యువతకు నిద్రను కరువు చేశారు దివ్యభారతి. అనుకోకుండా తెలుగు సినిమాను వదిలి ఆమె బాలీవుడ్‌కు వెళ్లిపోవడం.. అక్కడ ‘దివానా’తో భారీ విజయాన్ని అందుకొని సూపర్‌స్టార్ స్థాయికి ఎదగడం.. ఊహించని విధంగా ప్రమాదవశాత్త్తు ముంబయిలోని ఓ బహుళ అంతస్తుల భవనం మీదనుంచి కిందపడి తుదిశ్వాస విడవటం.. ఇవన్నీ గుర్తొస్తే గుండె బరువెక్కక మానదు. దివ్యభారతి మరణంపై నేటికీ అనుమానాలున్నాయి.
అది ఓ మిస్టరీ. త్వరలో ఆమె కథ సెల్యులాయిడ్‌పైకి రానుందని తెలుస్తున్నది. అందులో దివ్యభారతిగా మిల్కీబ్యూటీ తమన్నా నటించనున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ బయోపిక్‌ను నిర్మించనుంది. ఏదిఏమైనా నాటి కలలరాణి పాత్రలో నేటి యువతరం కలలరాణి నటించడం విశేషమే.