అగ్ర కథానాయిక తమన్నాకు ఐటెమ్‌సాంగ్స్ కొత్తేమీ కాదు. గతంలో ఈ భామ ప్రత్యేక గీతాల్లో తనదైన శైలి నృత్యవిన్యాసాలతో ఆకట్టుకుంది. తాజాగా తమన్నా ‘గని’ సినిమాలో ‘కొడితే..’ అనే ఐటెంసాంగ్‌లో మెరిసింది. గురువారం ఈ పాట తాలూకు పూర్తి వీడియోను విడుదల చేశారు. ‘వరదల్లే అడ్రినలిన్ పొంగనీ…నీ పవరెంటో పదునేంటో పంచుల్లో కనిపించనీ..’ అంటూ ఈ గీతం ఆద్యంతం హుషారుగా సాగింది. తమన్నా అందచందాలతో అలరించింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను హారిక నారాయణ్ ఆలపించారు. తమన్ స్వరకర్త. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకుడు. సయీ మంజ్రేకర్ కథానాయిక. ఏప్రిల్ 8న ప్రేక్షకులముందుకురానుంది. బాక్సింగ్ నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు, సునీల్‌శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం: తమన్, సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి.