Tabla Legend Zakir Hussain | ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూసిన విషయం తెలిసిందే. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే ఆయన మృతికి భారత ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. అయితే మూడేళ్లకే తబల పట్టి, ఏడేళ్లకే ప్రదర్శనలతో పాటు.. 12ఏళ్లకే అంతర్జాతీయ కచేరీలు నిర్వహించిన జాకీర్ హుస్సేన్ గొప్పతనం గురించి ఆయన భారతదేశానికి అందించిన సేవల గురించి తెలుసుకుందాం.
ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా (Ustad Alla Rakha) తనయుడే జాకీర్ హుస్సేన్. జాకీర్ 1951 మార్చి 09న ముంబైలో జన్మించాడు. తన తండ్రిని తబల వాయించడం చూసి మూడేళ్లకే తబలా పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. దీంతో మూడేళ్ల వయసులోనే తబల పట్టి ఏడేళ్ల వయసులోనే వాద్యంపై పట్టు సాధించడంతో పాటు ప్రదర్శనలు ఇచ్చారు. సంగీత కచేరిలు కూడా నిర్వహించారు.
12 ఏండ్ల వయసుకే.. అంతర్జాతీయ సంగీత ప్రదర్శనలు ఇచ్చిన విద్వాంసుడిగా చరిత్ర సృష్టించాడు. హిందుస్తాని క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించి తిరుగులేకుండా అయ్యాడు. ఒకవైపు సంగీతంలో తన ముద్రవేస్తునే.. ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఆయనకు భార్య అంటోనియా మిన్నెకోల కుమార్తెలు అనీసా ఖురేషి, ఇసాబెల్లా ఖురేషి ఉన్నారు. క్లాసికల్ డాన్సర్ అయిన అంటోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు జాకీర్. ఆరు దశాబ్దాల సంగీత ప్రయాణంలో హుస్సేన్ అనేకమంది ప్రఖ్యాత అంతర్జాతీయ కళకారులతో పనిచేశారు.
1973లో ఇంగ్లీష్ గిటారిస్ట్ జాన్ మెక్లఫ్లిన్, వయోలిన్ వాద్యకారుడు ఎల్ శంకర్, పెర్క్యూషనిస్ట్ ప్లేయర్ టి ఎచ్ విక్కు వినాయక్‌తో కలిసి హిందుస్తాని క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో ఆయన సంగీత ప్రదర్శన ఇచ్చాడు. తన కెరీర్లో పండిట్ రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్ శివకుమార్ శర్మలతో పాటు పలువురు దిగ్గజాలతో కలిసి పనిచేశాడు. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేయడంలో ఆయనవంతూ కృషిని అందించాడు. సంగీతం రంగంలో ఆయన అందించిన సేవలను భారత్‌తో పాటు ప్రపంచం గుర్తించింది. ప్రముఖ తాజ్ మహల్ టీ ఫేమస్ అవ్వడానికి ముఖ్య కారణం. జాకీరే.. 1980లో ఈ యాడ్ కోసం అప్పట్లోనే రూ.50000 పారితోషికం అందుకోని రికార్డు సాధించాడు.
జాకీర్ హుస్సేన్ ఇప్పటివరకు నాలుగు గ్రామీ అవార్డులు అందుకోగా.. భారత ప్రభుత్వం అతడిని.. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్.. 2023లో పద్మవిభూషణ్‌లతో సత్కరించింది. అమెరికా & భారతదేశం మధ్య సంబంధాలలో అతని సాంస్కృతిక సహకారానికి గుర్తింపుగా 1990లో ఇండో-అమెరికన్ అవార్డును ప్రదానం చేశారు. ఇంకా ఇవే కాకుండా.. శాన్ ఫ్రాన్సిస్కో జాజ్ సెంటర్ హుస్సేన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఇచ్చింది. ముంబై విశ్వవిద్యాలయం 2022లో సంగీత రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గౌరవ డాక్టర్ ఆఫ్ లా (LLD) డిగ్రీని ప్రదానం చేసింది.