Tapsee Pannu | సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో తాను ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నానని చెప్పింది అగ్ర కథానాయిక తాప్సీ. ప్రస్తుతం హిందీ సినీరంగంలో వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకొని సినిమాలు చేస్తున్న ఈ భామ కెరీర్ తొలినాళ్లలో తన అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మిస్ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొన్నప్పుడు అక్కడి రాజకీయాలు చూసి ఏవగింపు కలిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాప్సీ మాట్లాడుతూ ‘చాలా మందికి నేను మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న విషయం తెలియదు.
కాంటెస్ట్ సమయంలో నాది ఉంగరాలు జుట్టు అంటూ అక్కడి వారు హేళన చేశారు. ఇలాంటి హెయిర్‌ైస్టెల్‌తో మిస్ ఇండియాగా గెలవడం అసాధ్యమని నిరుత్సాహ పరిచారు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే..కార్పొరేట్ సంస్థలకు చెందిన కొందరు నా దగ్గరకు వచ్చి ఒకవేళ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంటే తమ సంస్థల తరపున మూడేళ్ల పాటు పనిచేయాలని, ముప్పై శాతం ఆదాయాన్ని ఇవ్వాల్సి ఉంటుందని భయపెట్టారు. ఆ రోజుల్ని తలచుకుంటే ఓ పీడకలలా అనిపిస్తుంది’ అని తాప్సీ పేర్కొంది.