తెలుగు చిత్ర పరిశ్రమ (Telugu Cinema) నుంచి బాలీవుడ్ కు పెళ్లి అనూహ్య విజయాలు సాధిస్తోంది పంజాబీ భామ తాప్సీ పన్ను (Taapsee pannu). తెలుగులో పూర్తి కమర్షియల్ సినిమాలు చేసిన ఈ నాయిక..హిందీలో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది. పింక్, బద్లా, బేబీ, రశ్మి రాకెట్ లాంటి చిత్రాలు తాప్సీని సినీ ప్రియులకు బాగా దగ్గర చేశాయి. ఆమె కొత్త సినిమా లూప్ లపేటా ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తాప్సీ ప్రేక్షకులు, తన అభిమానుల గురించి స్పందించింది.
ప్రేక్షకులు నాపై పెట్టుకున్న నమ్మకమే నన్ను కొత్త తరహా సినిమాలు చేసేందుకు ప్రోత్సహిస్తోంది. నేను ఎంచుకునే సినిమాల్లో కొత్తదనం ఉంటుందని వాళ్లు నమ్ముతారు. నేను వెళ్లే దారి భిన్నమైనది. దారి చూపేందుకు ముందెవరూ లేరు. అయినా ధైర్యంగా వినూత్నమైన కథల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నమే పరిశ్రమలో నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. నేను ఒక ప్రేక్షకురాలిగా ఎలాంటి సినిమాలు తెరపై చూడాలనుకుంటున్నానో అలాంటి చిత్రాల్లోనే నటించాలని ఆశిస్తున్నాను. అని చెప్పింది తాప్సీ
సైన్స్ ఫిక్షన్ కథతో లూప్ లపేటా (Loop lapeta) చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆకాష్ భాటియా. ఈ సినిమాలో తాప్సీ సరసన తాహిర్ రాజ్ భాసిన్ నటిస్తున్నారు. జర్మన్ రచయిత దర్శకుడు టామ్ టైకర్ రాసిన రన్ లోలా రన్ రచన ఆధారంగా లూప్ లపేటా తెరకెక్కింది. తాప్సీ సవి అనే పాత్రలో నటించింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఈ నెల 4న స్ట్రీమింగ్ మొదలు కానుంది.