Taapsee Pannu | వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నటిస్తూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ‘తాప్సీ’. ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో సినీరంగంలోకి ఎంట్రి ఇచ్చిన తాప్సీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం విజయంతో ఈమెకు భారీగా అవకాశాలు వచ్చాయి. కానీ అవి చాలా వరకు సెకండ్ హీరోయిన్గా నటించే పాత్రలే. ఆ తరువాత ఈమెకు టాలీవుడ్లో క్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఈమె బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. ఇక బాలీవుడ్లో ఈమె పట్టిందల్లా బంగారమే అయింది. ఈమె నటించిన ప్రతి సినిమా కొత్తగా ఉండటంతో పాటు తాప్సీ తనదైన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇటీవలే ఈమె షారుఖ్ ఖాన్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.
రాజ్‌కుమార్ హరాణి దర్శకత్వంలో షారుఖ్ ‘డంకీ’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో షారుఖ్ సరసన తాప్సీ ఎంపికైంది. తాజాగా దీనిపై తాప్సీ స్పందిస్తూ ‘షారుఖ్ సరసన నటించాలని తపించని నటులుండరు. అలాంటి అరుదైన అవకాశం నాకు దక్కింది. దీనికోసం నేను ఎవరిని అడుగలేదు. దర్శకుడు రాజ్‌కుమార్ హిరాని నా గత చిత్రాలలో నటను చూసి ఈ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేశాడని తెలిపింది. ఇప్పటికే నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు నమ్మలేకపోతున్నా. ఇది కలా? నిజమా? అనిపించిందంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. ఇటీవలే తెలుగులో ఈమె నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను పైగా సినిమాలున్నాయి.